Jubilee Hills By Election KK Survey: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నిక గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. అటు అధికార కాంగ్రెస్ పార్టీ.. ఇటు ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి ఎన్నికను అత్యంత సవాల్ గా తీసుకున్నాయి. ఈ స్థానంలో గెలిచేందుకు భారత రాష్ట్ర సమితి సర్వశక్తులూ ఒడ్డుతున్నది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ గెలవాలని భావిస్తోంది. వాస్తవానికి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి పెద్దగా ఆశలు లేవు. పోటీ ప్రధానంగా కాంగ్రెస్, గులాబీ పార్టీల మధ్య ఉంది. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు సంబంధించి కేకే సర్వే సంచలన నివేదికను బయట పెట్టింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేది ఆ పార్టీనే అని స్పష్టం చేసింది.
Also Read: ‘ఛాంపియన్’ టీజర్ లో శ్రీకాంత్ కొడుకు రోషన్ కుమ్మేసాడుగా…
ఏరియా వారీగా తమ బృందాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గం విస్తరించిన ప్రాంతాలలో సర్వే నిర్వహించారు కేకే సర్వే సంస్థ నిర్వాహకుడు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కంటే భారత రాష్ట్ర సమితికి 12 నుంచి 13 శాత మెజారిటీ వస్తుందని పేర్కొన్నారు. శ్రీనగర్, ఎర్రగడ్డ, షేక్ పేట, బోరబండ ప్రాంతాలలో గులాబీ పార్టీకి లీడ్ కనిపిస్తోందని కేకే సర్వే వెల్లడించింది. వెంగళరావు నగర్, రహమత్ నగర్ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని వివరించింది..
ఈ సర్వే నేపథ్యంలో గులాబీ పార్టీ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నది. తమ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలిచినట్టు పేర్కొంటున్నది. అంతేకాదు ఎన్నిక ద్వారా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని స్పష్టం చేస్తున్నది. కేటీఆర్ ఇటీవల కాలంలో పదే పదే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న నేపథ్యంలో.. కేకే సర్వేను ప్రధానంగా ప్రస్తావిస్తూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితమే 2028 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో వస్తుందని చెబుతున్నారు.
కేకే సర్వే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వెల్లడించిన నివేదిక నిజమైంది. అయితే ఇదే సర్వే సంస్థ మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాలలో ఓ నివేదికను వెల్లడించింది. అయితే అది వాస్తవరూపం దాల్చలేదు. మరోవైపు కేకే సర్వే పై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేకే సర్వే నిర్వాహకుడు గతంలో హరీష్ రావు దగ్గర ఉండేవాడని.. ఇటీవల కాలంలో హరీష్ రావు మీడియా అధినేతని కలిసినప్పుడు కేకే సర్వే నిర్వాహకుడు అక్కడే ఉన్నాడని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. దానికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలను సర్వే సంస్థల నివేదికలు ప్రభావితం చేయలేవని.. అంతిమంగా ప్రజల చేతిలోనే జూబ్లీహిల్స్ ఫలితం ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.