Ponguleti Srinivasa Reddy: తెలంగాణలో నామినేషన్ల పర్వం ప్రారంభమవుతుండగా… ఆదాయ పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగాయి. కాంగ్రెస్ లో కీలక నేతలపై టార్గెట్ చేసుకున్నాయి. ఈసారి సామాజికంగా, ఆర్థికంగా బలమైన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ బరిలో దించింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను టార్గెట్ చేసుకొని ఐటీ, ఈడి అధికారులు సోదాలకు దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది ముమ్మాటికీ రాజకీయ చర్యేనన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ముఖ్యంగా మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ ఐటీ, ఈడీ సోదాలకు దిగడం సంచలనం కలిగిస్తోంది.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం మాజీ ఎంపీ. ప్రముఖ పారిశ్రామికవేత్త కూడా. అధికార బీఆర్ఎస్ నుంచి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. పాలేరు అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ హై కమాండ్ అభ్యర్థిగా కూడా ప్రకటించింది. ఆయనతో పాటు తుమ్మల నాగేశ్వరరావు సైతం కాంగ్రెస్ గూటికి చేరారు. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పొంగులేటి గట్టిగానే కృషి చేస్తున్నారు. పారిశ్రామికవేత్త కావడం, కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేస్తారన్న ప్రచారం కూడా ఉంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఈ తరుణంలో పొంగులేటి వంటి వారు ఆ పార్టీలో చేరడం అధికార బీఆర్ఎస్ తో పాటు బిజెపికి మింగుడు పడడం లేదు. అందుకే ఈ సోదాలు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఏకకాలంలో పొంగులేటి ఇళ్లతో పాటు కార్యాలయాల్లో ఈడి, ఐటీ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాదులోని నందగిరి హిల్స్, ఖమ్మంలోని ఆయన నివాసాల్లో తనిఖీలు చేపడుతున్నారు. ఖమ్మంలో గురువారం వేకువజామున మూడు గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. 8 వాహనాల్లో వచ్చిన ఈడీ అధికారులు మూకుమ్మడిగా పొంగులేటి ఇంట్లోకి ప్రవేశించి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం నామినేషన్ వేసేందుకు పొంగులేటి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ తన నివాసం పై ఐటి దాడులు జరగవచ్చని వ్యాఖ్యానించారు. ఆయన అనుమానానికి తగ్గట్టే గురువారం వేకువజామున ఐటి, ఈడి అధికారులు సోదాలకు రావడం గమనార్హం.
ఎన్నికల ముంగిట ఇది ముమ్మాటికీ కక్షపూరిత చర్యగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నామినేషన్ల పర్వంకు సిద్ధమవుతుండగా.. కాంగ్రెస్ పార్టీ స్థైర్యాన్ని దెబ్బకొట్టేందుకే ఈ దుశ్చర్యకు దిగారని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్న తరుణంలో.. అధికార బీఆర్ఎస్, బిజెపి కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.ఇలాంటి చర్యలకు దిగిన కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆపలేరని స్పష్టం చేస్తున్నారు. మొత్తానికైతే ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేయాలన్న ప్రయత్నంలో బిజెపి ఉంది. దీనిని హస్తదళం ఎలా అధిగమిస్తుందో చూడాలి.