BJP Vs BRS : తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య మళ్లీ లొల్లి రాజుకుంటోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు, తర్వాత పార్టీలో నెలకొన్న అంతర్గత సమస్యలతో కొన్ని రోజులుగా టీబీజేపీ నేతలు సైలెంట్ అయ్యారు. దీంతో బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని ప్రచారం జరిగింది. ఇక టీ కాంగ్రెస్ నేతలు అయితే బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అని ఆరోపణలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ నిర్వహించిన సభల్లో బీజేపీని పల్లెత్తు మాట కూడా అనకపోవడం, బీజేపీ కూడా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై మౌనం వహించడం కాంగ్రెస్ ఆరోపణలకు బలం చేకూర్చాయి. మరోవైపు తెలంగాణలో బీజేపీ వెనక్కు తగ్గిందని, పోటీ నుంచి తప్పుకుందని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో టీబీజేపీ చీఫ్ ఒక్కసారిగా మళ్లీ పార్టీని లైన్‌లోకి తెచ్చే ప్రయత్నం ప్రారంభించారు.
BJP Vs BRS : మళ్లీ మొదలైంది.. మైండ్‌గేమ్ స్టార్ చేసిన బీజేపీ..!
ట్వీట్‌తో బీఆర్‌ఎస్‌పై విమర్శలు..
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇటీవల సంక్షేమ దినోత్సవం నిర్వహించింది. ఈ వేడుకలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓ ట్వీట్ చేశాడు. మహిళలను గౌరవించని ప్రభుత్వం మహిళా దినోత్సవం నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, ఎమ్మెల్యే కవిత స్పందించారు. బీజేపీ తొమ్మిదేళ్ల పాలనలో మహిళలకు ఇచ్చిన గౌరవం ఇదేనా అంటు పలు ప్రశ్నలు సంధించారు. గ్యాస్ ధర 1200లు చేయడం, రెజ్లర్లను వేధించడం వరకు అనేక అంశాలను తన ట్వీట్‌లో ప్రస్తావించారు. దీంతో ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉన్న బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య మళ్లీ వార్ మొదలైంది.
కొనసాగింపుగా ఐటీ దాడులు..
బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య మొదలైన వార్‌ను కొనసాగింపు అన్నట్లుగా బుధవారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీ ఇంటిపై ఐటీ దాడులు మొదలయ్యాయి. ఏకకాలంలో 12 బృందాలు ఎమ్మెల్యేలు, ఎంపీ ఇళ్లలో, కార్యాలయాల్లో సోదాలు చేయడం చర్చనీయాంశమైంది. ఎంపీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఇవి బీజేపీ ప్రేరేపిత దాడులే అని విమర్శించారు. తన వ్యాపార లావాదేవీలన్నీ పారదర్శకంగా జరుగుతాయని తెలిపారు. తాను ఇప్పటి వరకు రూ.150 కోట్ల ట్యాక్స్ కట్టానని వెల్లడించారు. బుధవారం మొదలైన ఐటీ దాడులు గురువారం కూడా కొనసాగుతున్నాయి.
ఇక సంజయ్ మార్క్ పాలి‘ట్రిక్స్’..
ఒకవైపు ఐటీ దాడులు కొనసాగుతుండగానే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన పాలి‘ట్రిక్స్’ మొదలు పెట్టారు. బీజేపీతో అధికార పార్టీకి చెందిన 25 మందిఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని బాంబు పేల్చారు. వాస్తవంగా మునుగోడు ఎన్నికల తర్వాత, కర్ణాతకలో బీజేపీ ఓటమి తర్వాత ఆ పార్టీలో చేరికలు ఆగిపోయాయి. చేరికలకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దనేతలెవరూ పార్టీలో చేరడం లేదు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావును బీజేపీలోకి తీసుకువచ్చేందుకు చేరికల కమిటీ చైర్మన్ అనేక విధాలుగా ప్రయత్నించారు. కానీ చేరికపై స్పష్టత రాలేదు. ఈ క్రమంలో పార్టీలో ఉత్సాహం నింపేందుకు, స్తబ్ధుగా ఉన్న పార్టీ శ్రేణుల్లో మళ్లీ జోష్ నింపేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు ప్రయత్నాలు ప్రారంభించారు.
కాంగ్రెస్‌కు బీజేపీ ఆర్థికసాయం..
మరోవైపు బీజేపీ బీఆర్‌ఎస్ ఒక్కటే అన్న ఆరోపణలు తిప్పికొట్టేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని ప్రకటన చేశారు. అంతటితో ఆగకుండా వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు వీక్‌గా ఉన్న చోట.. కాంగ్రెస్ అభ్యర్థులకు ఆర్థికసాయం చేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. గతంలో కూడా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని బీజేపీ నేతలు ప్రకటించగా.. తాజాగా పార్టీ అద్యక్షుడు బండి సంజయ్ అలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.