HomeతెలంగాణTelangana Thalli Statue: తెలంగాణ తల్లిని మార్చేసిన రేవంత్‌ రెడ్డి నిర్ణయం కరెక్టేనా?

Telangana Thalli Statue: తెలంగాణ తల్లిని మార్చేసిన రేవంత్‌ రెడ్డి నిర్ణయం కరెక్టేనా?

Telangana Thalli Statue: తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పంచాయితీలు చాలవన్నట్లు.. తాజాగా విగ్రహాల పంచాయతీ మొదలైంది. పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం దొరలకు ప్రతీకగా ఉందని, దొరసానిని ప్రతిభింభిస్తుందని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ ఆనవాళ్లు చెరిపే ప్రక్రియలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహం మార్చే పనికి పూనుకున్నారు. ఈ ఏడాది జూన్‌ 2న తెలంగాణ గీతం ఆవిష్కరించిన ప్రభుత్వం అదే రోజు తెలంగాణ సామాన్య మహిళను ప్రతిబింభించేలా తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఆవిష్కరించాలని భావించింది. కానీ, చర్చ జరగకుండా నిర్ణయం తీసుకోకూడదని డిసెంబర్‌ 9కి వాయిదా వేసింది. ఈ క్రమంలో ఇటీవలే నూతన తెలంగాతల్లి విగ్రహం రెడీ అయింది. దానికి నిండుగా ముసుగు వేసుకుని కొత్త సచివాలయం ప్రాంగణానికి తీసుకువచ్చారు.

కొత్త విగ్రహం ఇలా..
రేవంత్‌ సర్కార్‌ తయారు చేయించిన కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని పరిశీలిస్తే.. బంగారు అంచు గల ఆకుపచ్చరంగు చీరలో నుదుట కుంకుమ బొట్టు, చేతులకు మట్టి గాజులు, ఒక చేతిలో వరి, మొక్కజొన్న, సజ్జ కంకులు పట్టుకుని ఉద్యమ స్ఫూర్తి చాటేలా పిడికిలి బిగించి ఉంది. తాజాగా విగ్రహం ఫొటోను అధికారులు విడుదల చేశారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహాల్లో ఏది బాగుందన్న చర్చ జరుఉగతోంది. కేసీఆర్‌ తయారు చేయించిన విగ్రహం గులాబీ రంగు చీర, చేతులకు బంగారు గాజులు, నుదుటన కుంకుమ బొట్టు తలపై కిరీటం. మెడలో బంగారు హారం. నడుముకు వడ్డాణంతో ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న తల్లి సంపన్నులకు ప్రతీకగా ఉందని రేవంత్‌ సర్కార్, తెలంగాణ సాధారణ మహిళకు ప్రతీకగా కొత్త విగ్రహం తయారు చేయించారు.

దేవతకు కిరీటం ఉండదా..
అయితే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న చర్చలో.. తెలంగాణ తల్లిని దేవతగా కొలిచినప్పుడు దేవుళ్లకు కిరీటం ఉండాలి కదా అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దేవుళ్లకు కిరీటాలు ఉండడం సహజం. ఈ నేపథ్యంలో తెలంగాణ తల్లికి కిరీటం ఉండాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇక కేసీఆర్‌ తయారు చేయించిన తెలంగాణ తల్లి విగ్రహం చేతులో తెలంగాణకు ప్రతీక అయిన బతుకమ్మ ఉంది. ప్రస్తుత విగ్రహం చేతిలో లేదు. దీంతో తెలంగాణ అస్తిత్వం లేదన్న భావన కలుగుతోంది. చేయి గుర్తును చూపిస్తున్నట్లుగా కొత్త విగ్రహం ఉంది. దీంతో కొత్త విగ్రహాన్ని తెలంగాణ తల్లిగా ఆమోదిస్తారా అన్న చర్చ జరుగుతోంది.

కొందరి వాదన ఇలా…
ఇక మరికొందరు కిరీటం ఉంటేనే దేవత అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో పంటలను సూచించేలా ఒక చేతిలో వరి, మక్క, సజ్జ కంకులు ఉంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాక ముందు నుంచే బతుకమ్మ జరుపుకుంటున్నాం కదా.. తెలంగాణ తల్లి చేతిలో లేకపోతే నష్టం ఏమిటి అని వాదిస్తున్నారు. ఇక చేయి ఆశీర్వదిస్తున్నట్లు ఉంది. దేవతలందరికీ ఇలాగే ఉంటుంది. అది కాంగ్రెస్‌ చిహ్నం ఎలా అవుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు.

రాజకీయం ఎందుకు…
ఇక తెలంగాణ విగ్రహం మార్చడం వలన అస్తిత్వం మారదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లు దాటింది. అయినా ఇప్పటికీ తెలంగాణ సెంటిమెంటుతోనే పార్టీలు పబ్బం గడుపుకుంటున్నాయి. కేసీఆర్‌ తన కూతురు రూపం వచ్చేలా విగ్రహం తయారు చేయించాడని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఇప్పుడు రేవంత్‌ కూడా తన కూతురు, భార్య ముఖం వచ్చేలా విగ్రహం తయారు చేయించాడని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక కేటీఆర్‌ అయితే..తాము అధికారంలోకి వచ్చాక విగ్రహం తొలగిస్తామని తెగేసి చెబుతున్నారు. మొత్తంగా ఇద్దరూ విగ్రహ రాజకీయాలపై ఉన్న శ్రద్ధ సమస్యల పరిష్కారం, అభివృద్ధిపై పెడితే బాగుండన్న వాదన వినిపిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version