Ravi Prakash: తెలుగు నాట ప్రస్తుతం 24 గంటల పాటు వార్తలు అందించే చానల్స్ ఎన్నో ఉన్నాయి. ఇక యూట్యూబ్ ఛానల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాలలో ఈ 24 గంటల వార్త ఛానళ్ల సంస్కృతికి బీజం వేసింది రవి ప్రకాష్. తెలుగు రాష్ట్రాలలో ఒకప్పుడు అతని పేరు ఒక బ్రాండ్ గా ఉండేది. టీవీ9 అనే సంస్థను స్థాపించిన అతడు.. దానిని మరింతగా విస్తరించాడు. దాదాపు చాలా భాషల్లో ఆధిపత్యం సాధించేలాగా చేశాడు. అయితే అంతటి రవి ప్రకాష్ ఒకానొక దశలో తన పెంచిన టీవీ9 నుంచి బయటికి రావాల్సి వచ్చింది. మీడియాలో ఆయనకు శత్రువులు పెరిగారు. రాజకీయంగా అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ పెద్దలు ఇబ్బంది పెట్టారు. ఫలితంగా రవి ప్రకాష్ అనే బ్రాండ్ నేమ్ తగ్గుముఖం పట్టడం మొదలైంది. ఆ తర్వాత ఆయన చాలావరకు గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడిప్పుడే మళ్ళీ మెల్లగా తన బ్రాండ్ కు ఊపిరులు ఊదుతున్నారు. ఆర్టీవీ ని క్రమక్రమంగా విస్తరించుకుంటూ వెళ్తున్నారు. ఆర్థికంగా ఆయనకు పరిమితులు ఉన్నప్పటికీ.. ప్రజల్లోకి ఆ ఛానల్ వాయిస్ తీసుకెళ్తున్నారు.
సంచలన విషయాలతో
రవి ప్రకాష్ అంటేనే సంచలనానికి మారుపేరు. ఒకప్పుడు ఇలాంటి సంచలనం ద్వారానే టీవీ9 బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేయగలిగారు. ప్రస్తుతం ఆర్టీవీ ని కూడా అలా చేసే పనిలో పడ్డారు రవి ప్రకాష్. మెల్లిమెల్లిగా సంచలన విషయాలను బయటపెడుతున్నారు. ఏపీలో ఎన్నికలకు ముందు తన బృందంతో చేసిన స్టడీని బయటపెట్టారు. కూటమి అధికారంలోకి వస్తుందని రవి ప్రకాష్ చెప్పారు. అయితే దీనిని అప్పటి వైసిపి నేతలు తేలిగ్గా తీసుకున్నారు. రవి ప్రకాష్ అమ్ముడుపోయాడని ఆరోపించారు. కానీ ఎన్నికల ఫలితాల్లో ఆయన చెప్పిందే నిజమైంది. ఇక తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి సున్నా సీట్లు వస్తాయని అన్నారు. ఆయన చెప్పినట్టుగానే భారత రాష్ట్ర సమితి ఒక్క పార్లమెంటు స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. చివరికి మెదక్ లోనూ ఓడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆయన భారత రాష్ట్ర సమితి , భారతీయ జనతా పార్టీ వీలినాన్ని ప్రకటించారు. ఢిల్లీ ఎన్నికల అనంతరం ఈ విలీన ప్రక్రియ మొదలవుతుందని అంచనా వేశారు. అయితే దీనిని భారత రాష్ట్ర సమితి నాయకులు ఇప్పటికిప్పుడు ఖండించారు. అయితే త్వరలో జరగబోయేది అదేనని అటు గులాబీ, ఇటు కాషాయ పార్టీ నేతలు నమ్ముతున్నారు.
మేఘా గుట్టురట్టు
మేఘా పనికి సంబంధించి బ్యాంక్ గ్యారెంటీ స్కాం ను రవి ప్రకాష్ బట్టబయలు చేశారు.. యూరో ఎగ్జిమ్ బ్యాంకు వ్యవహారాన్ని ఆయన బయటి ప్రపంచానికి తెలియజేశారు. ఆయనకు ఎన్ని రకాలుగా లీగల్ నోటీసులు ఇచ్చినప్పటికీ.. సోషల్ మీడియాలో ఆయనపై దుష్ప్రచారం జరుగుతున్నప్పటికీ రవి ప్రకాష్ ఏమాత్రం బ్యాక్ స్టెప్ చేయడం లేదు. మరోవైపు తన సెకండ్ ఇన్నింగ్స్ మరింత జోరుగా ఉంటుందని ఆయన చెప్పకనే చెబుతున్నారు. అయితే సంచలన విషయాలు వెల్లడించే క్రమంలో ఆయన పూర్తి ఆధారాలను బయటపెడుతున్నారు. ఏదో వ్యూస్ కోసం మాత్రమే కాకుండా.. ప్రజల కోణంలో ఆయన వార్తలను ప్రసారం చేస్తున్నారని మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.