Kavitha New Party: ఇటీవల కాలంలో తరచూ ఏదో విషయం మీద మాట్లాడుతూ.. తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారారు కల్వకుంట్ల కవిత. కెసిఆర్ కుమార్తె ట్యాగ్ లైన్ తో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె.. ఇప్పుడు ఏకంగా సొంతంగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే ఆమె జాగృతి జనం బాట ద్వారా ప్రజలతో మమేకం అవ్వడానికి ఆరాటపడుతున్నారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి ఆమె అడుగులు వేస్తున్నారు. జాగృతి ఆధ్వర్యంలో ఆమె ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు ప్రకటించారు.
కవిత చెప్పినట్టుగా జాగృతి అనేది రాజకీయ సంస్థ కాదు. రాజకీయ పార్టీ అంతకంటే కాదు. తెలంగాణ ఉద్యమంలో జాగృతి ఆధ్వర్యంలోనే కవిత కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత జాగృతి విషయంలో కవిత అంత వేగంగా అడుగులు వేయలేకపోయారు. అన్నిటికంటే ముఖ్యంగా జాగృతి కార్యకలాపాలను విస్తృతంగా నిర్వహించలేకపోయారు. ముఖ్యంగా పార్లమెంట్ సభ్యురాలిగా గెలిచిన తర్వాత అప్పటివరకు జాగృతిలో పనిచేసినవారు తమకు ఎదుగుదల లేక ఇతర వ్యాపకాలు చూసుకున్నారు. గులాబీ పార్టీలో విభేదాలు రావడంతో కవిత తన దారి తాను చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ లోగానే గులాబీ పార్టీ ఆమెను బయటకు పంపించింది. దీంతో గులాబీ పార్టీ ద్వారా తనకు లభించిన ఎమ్మెల్సీ పదవిని కూడా ఆమె వద్దనుకున్నారు. స్పీకర్ ఫార్మేట్ లోనే రాజీనామాను పంపించారు. అయితే ఇంతవరకు స్పీకర్ ఆ రాజీనామాను ఆమోదించలేదు.
రాజకీయంగా సొంతంగా అడుగులు వేయాలని కవిత ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. జాగృతి జనం బాట పేరుతో ఆమె ఒక కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీ పెట్టే విషయంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ” జాగృతి పార్టీగా మారడం పెద్ద విషయం కాదు. పక్క రాష్ట్రమైన ఏపీలో మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అయితే ప్రజలకు మంచి చేయాలి అనుకుంటే పార్టీ ఉండాల్సిన అవసరం లేదు. ప్రజలు కోరుకుంటే పార్టీ వస్తుంది. అందులో పెద్దగా ఇబ్బంది లేదని” కవిత వ్యాఖ్యానించారు. మొన్నటిదాకా రాజకీయ పార్టీ పెడతానని కవిత పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడేమో రాజకీయ పార్టీ గురించి ఈ తరహాలో మాట్లాడుతున్నారు. ఈ ప్రకారం చూసుకుంటే కవితకు రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేనట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఒక మహిళగా, మాజీ ముఖ్యమంత్రి కుమార్తెగా షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టారు. ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్లో కలిపేశారు. షర్మిల ఉదంతం కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో పార్టీ ఏర్పాటు విషయంలో కవిత వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. అలాంటప్పుడు జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే ఈ పొలిటికల్ స్టేట్మెంట్లు ఎందుకో అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజకీయ పార్టీని నడపాలంటే భారీగా డబ్బు అవసరం పడుతుందని.. ఇప్పటికిప్పుడు అంత ఖర్చు పెట్టుకునే స్థాయి కవితకు లేదు కాబట్టే ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.