Viral video : ఈ పోస్టులో కొనసాగే అధికారం మీకు ఎక్కడిది?.. ఐపీఎస్ అధికారికి రిపోర్టర్ ప్రశ్న.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

అప్పట్లో భారత రాష్ట్ర సమితికి అధికారిక ఛానల్ ప్రతినిధులు ఇలాగే ప్రభుత్వ కార్యాలయాలలోకి వెళ్లేవారు. ఏ పనైనా సులభంగా చేయించుకునేవారు. లేకుంటే తీవ్రంగా ఇబ్బంది పెట్టేవారు. వారి బుద్ధిని ఇప్పుడు ఈ ఛానల్ ప్రతినిధులు వంట పట్టించుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు..

Written By: NARESH, Updated On : August 17, 2024 5:35 pm

kamalasan Reddy (1)

Follow us on

Viral video: మీడియాకు రాజ్యాంగంలో సముచిత ప్రాధాన్యం ఉండొచ్చు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో నిర్మొహమాటంగా మాట్లాడే హక్కు మీడియాకు దక్కి ఉండవచ్చు.. కానీ ఇన్ని సౌలభ్యాలు ఉన్నాయి కదా అని మీడియా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే.. ఆ స్వేచ్ఛకు అర్థం మారిపోతుంది. రాజ్యాంగం కల్పించిన ఆ హక్కు నిరర్దకమవుతుంది. ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. తెలంగాణలో ఓ సెక్షన్ మీడియా చేస్తున్న అతి ఆ స్థాయిలో ఉంది కాబట్టి.. అది ఏకంగా ఐపీఎస్ అధికారులను, వారి ఛాంబర్ లోకి వెళ్లి ప్రశ్నించేంత స్థాయికి ఎదిగింది కాబట్టి.. అన్నింటికీ మించి మీకు ఈ పోస్టులో కొనసాగే హక్కు ఉందా? నేరుగా అడిగే దాకా వెళ్ళింది కాబట్టి..

ఓ ప్రైవేట్ ఛానల్ ఇటీవల తెలంగాణలో ఫార్మసీ చైన్ నడుపుతున్న కంపెనీ పై స్టింగ్ ఆపరేషన్ కథనం ప్రసారం చేసింది. గుడ్ ఇలాంటి కథనాలు మీడియా మర్చిపోయి చాలా రోజులైంది. సరే ఆ ఛానల్ యాజమాన్యాన్ని అభినందిద్దాం. ఇలాంటి కథనాలు మరిన్ని ప్రసారం చేయాలని కోరుకుందాం. అదే చానల్ యాజమాన్యం భారత రాష్ట్ర సమితి పరిపాలన కాలంలో కేటీఆర్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు భువి, ధాత్రి అని పేరు లేని కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని, భూములు కేటాయించారని ఓ పరిశోధనాత్మక కథనాన్ని కూడా ప్రసారం చేసింది. ముఖ్యమంత్రి ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో.. ఆయన సోదరుడు డైరెక్టర్గా ఉన్న స్వచ్ఛ బయో అనే కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని భారత రాష్ట్ర సమితి బట్టబయలు చేసింది. దానికి కౌంటర్ గా ఆ ఛానల్ ఈ కథనాన్ని ప్రసారం చేసిందనే ప్రచారం మీడియా సర్కిల్లో సాగుతోంది. ఇక ఆ ఛానల్ లో పనిచేసే ఓ రిపోర్టర్ చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..

ఈ కథనం ప్రారంభంలో చెప్పినట్టు ఇటీవల ఆ ఛానల్ ఓ చైన్ లింక్ ఫార్మసీ కంపెనీ వ్యవహారంపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. వరుస కథనాలు ప్రసారం చేసింది. ఆ తర్వాత ఆ ఛానల్ మహిళా రిపోర్టర్ ఒకరు తెలంగాణలో ఫార్మా విభాగానికి కీలక అధికారిగా పనిచేస్తున్న ఓ ఐపీఎస్ ఛాంబర్ లోకి వెళ్ళింది. ఆయన ఆ సమయంలో కూర్చుని ఉన్నారు. ఆ మహిళా రిపోర్టర్ నేరుగా వెళ్లి.. మీకు ఈ కుర్చీలో కూర్చునే అర్హత ఉందని భావిస్తున్నారా? అని ప్రశ్నించింది. దీంతో షాక్ తినడం ఆ ఆఫీసర్ వంతయింది. అసలు ఆమె అడుగుతున్న ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆయన అలా నిశ్శబ్దాన్ని ఆశ్రయించారు. ఇక ఆ అధికారి చాంబర్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి వచ్చి ఆ మహిళా రిపోర్టర్ ను బయటికి పంపించే ప్రయత్నం చేశారు. వీడియో తీస్తున్న వ్యక్తిని కెమెరా మూసేయాలని ఆదేశించారు. అయితే ఈ వీడియోను భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగం తెగ సర్కులేట్ చేస్తోంది. ఇదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలపై మండిపడుతోంది.

వాస్తవానికి ఆ ఛానల్ రిపోర్టర్ అడిగిన తీరు సరిగ్గా లేదని పలువురు సీనియర్ రిపోర్టర్లు చెబుతున్నారు. ” ఒక అధికారిని ప్రభుత్వం నియమిస్తుంది. అతడికి ఉన్న మెరిట్స్ ఆధారంగా పోస్టు కట్టబెడుతుంది. ఒకవేళ ఆయన ఏవైనా తప్పులు చేస్తే బాధ్యతగల మీడియాగా వాటిని ఎత్తిచూపాలి. వాటిని ప్రజల ముందుకు తీసుకెళ్లాలి. ఆ తర్వాత ఆ సమస్యకు పరిష్కార మార్గం ప్రభుత్వం చూస్తుంది. మీడియా అనేది ఒక సంధాన కర్త పాత్ర మాత్రమే పోషించాలి. అంతేతప్ప చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. అన్నింటికీ మించి వ్యవస్థలో మొత్తం మేమే అన్నట్టుగా ప్రవర్తించకూడదు. ఒక మీడియా రిపోర్టర్ ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఛాంబర్ లోకి వెళ్లడం తప్పు. ఆయన అనుమతి లేకుండా వీడియో రికార్డ్ చేయడం మరింత పెద్ద తప్పు. ఈ వ్యవహారంపై ఒకవేళ ఆ అధికారి కోర్టుకు వెళ్తే ఛానల్ యాజమాన్యం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. వాస్తవానికి బాధ్యత ఉన్న మీడియా ఇలాంటి పని చేయదని” సీనియర్ జర్నలిస్టులు అంటున్నారు.

అయితే ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన సమయంలో.. ఓ జిల్లాకి కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పని చేశారు. ఆ సమయంలో అప్పటి అధికార పార్టీ నేతలకు అనుకూలంగా పనిచేశారు అనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ అధికారిని ఆ జిల్లా నుంచి బదిలీ చేయించి.. ఫార్మా విభాగానికి అధికారిగా కేటాయించింది. ఇక అప్పట్లో భారత రాష్ట్ర సమితికి అధికారిక ఛానల్ ప్రతినిధులు ఇలాగే ప్రభుత్వ కార్యాలయాలలోకి వెళ్లేవారు. ఏ పనైనా సులభంగా చేయించుకునేవారు. లేకుంటే తీవ్రంగా ఇబ్బంది పెట్టేవారు. వారి బుద్ధిని ఇప్పుడు ఈ ఛానల్ ప్రతినిధులు వంట పట్టించుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు..