BRS Party: శీర్షిక చదవగానే ఎక్కడో విన్నట్లు ఉంది కదా.. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ స్లోగన్ ‘ఎట్లుండె తెలంగాణ.. ఎట్లమారె తెలంగాణ’ను కాస్త మార్చాం. ఎందుకంటే ఇప్పుడు ఆ స్లోగన్ బీఆర్‌ఎస్‌కు సరిగ్గా సరిపోతుంది. పవర్ పాలిటిక్స్, ఆధిపత్యపోరు అంతర్గత కలహాలతో పార్టీ సతమతమవుతోంది. తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా ఉన్న పార్టీ, ఇప్పుడు అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో బలంగా ఉద్భవించి, దాదాపు ఒక దశాబ్దంపాటు అధికారంలో కొనసాగిన ఈ పార్టీ, ఇప్పుడు ఓటమి, నాయకుల బయటకు వెళ్లడం, కీలక నాయకుల దూరం వంటి సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోంది. వీటికితోడు తాజాగా అంతర్గత కొట్లాటలు క్యాడర్‌లో అనేక అనుమానాలు, ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.
Also Read: అక్కడ ‘ఓజీ’ రిలీజ్ లేనట్టే..పవన్ కళ్యాణ్ అభిమానులకు చేదు వార్త!
ఉద్యమం నుంచి అధికార వరకు..
బీఆర్‌ఎస్ అలియాస్ టీఆర్‌ఎస్ 2001లో కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం ఏర్పడింది. తెలంగాణ ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచిన ఈ పార్టీ, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ వ్యూహాత్మక నాయకత్వం, హరీశ్‌రావు, కేటీఆర్, కవిత వంటి కుటుంబ సభ్యుల బలమైన మద్దతు, రాష్ట్ర ప్రజల ఆదరణతో బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా బలమైన శక్తిగా మార్చాయి. 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలతో పార్టీ తన ఆధిపత్యాన్ని స్థిరపరిచింది. అయితే, ఈ విజయాల వెనుక కొన్ని సమస్యలు మొదలయ్యాయి. అధికారంలో ఉండగా, బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత పెరగడం, ఆరోపణలు, కొన్ని విధానాలపై విమర్శలు బలపడ్డాయి. ప్రజల అసంతృప్తి, ప్రతిపక్షాల బలోపేతం క్రమంగా బీఆర్‌ఎస్ బలాన్ని సన్నగిల్లేలా చేశాయి.
పేరు మార్పు.. ఓన్నికల్లో ఓటమి..
2022లో కేసీఆర్ జాతీయ రాజకీయ ఆకాంక్షలతో టీఆర్‌ఎస్ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్ )గా మార్చారు. ఈ నిర్ణయం పార్టీ దృష్టిని తెలంగాణ రాజకీయాల నుంచి జాతీయ స్థాయికి మళ్లించినప్పటికీ, ఇది తెలంగాణలోని స్థానిక సమస్యల నుంచి దృష్టిని మరల్చిందనే విమర్శలు వచ్చాయి. 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఊహించని ఓటమిని చవిచూసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో గులాబీ పార్టీ రాజకీయ ఆధిపత్యం క్షీణించింది.
పార్టీని వీడిన నాయకులు..
2023 ఎన్నికల ఓటమి తర్వాత, బీఆర్‌ఎస్‌లో అస్థిరత మరింత పెరిగింది. పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు పార్టీని వీడి కాంగ్రెస్, బీజేపీలో చేరారు. ఇది పార్టీ బలాన్ని మరింత దెబ్బతీసింది. అంతేకాక, కేసీఆర్ కూతురు కవిత ఆధితప్యం కోసం పార్టీ విధానాలను తప్పు పట్టడం అగ్గి రాజేసింది. చివరకు హరీశ్‌రావు, సంతోష్‌రావు టార్గెట్‌గా చేసిన ఆరోపణలు పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకు వెళ్లాయి. కవిత, ఒకప్పుడు పార్టీలో ముఖ్యమైన నాయకురాలిగా ఉండేది. ఇప్పుడు ఆమె దూరం కావడం, ఒకవైపు కుటుంబంలోని అంతర్గత సమస్యలను సూచిస్తుండగా, మరోవైపు పార్టీలో నాయకత్వ సంక్షోభాన్ని స్పష్టం చేస్తోంది. ఈ పరిణామాలు ఆఖ యొక్క భవిష్యత్తుపై ఆందోళనలను పెంచాయి. దీంతో క్యాడర్‌లో కూడా కలవరం మొదలయ్యాయి. అధిష్టానంపై అనేక అనుమానాలు, ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి.