Udayam: ఒక మనిషి అహం చాలామందిని ప్రభావితం చేస్తుంది. ఒక మనిషి పొగరు చాలా కుదుపులకు కారణమవుతుంది. ఒక మనిషి దిక్కారం చాలా మార్పులకు బీజం వేస్తుంది. అలాంటి ఇద్దరు మనుషుల మధ్య ఏర్పడిన సంఘర్షణ తెలుగు మీడియాలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. సరికొత్త ఉదయానికి శ్రీకారం చుట్టింది… అలాంటి సంచలనం ఉదయం పత్రిక అయితే.. అది ఏర్పడేందుకు కారణం రామోజీరావు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం.. అలా ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడిన పత్రికా యుద్ధం చాలా మార్పులకు కారణమైంది.. అనేక రకాల సంచలనాలకు కారణభూతమైంది.. ఇంతకీ అప్పుడు ఏం జరిగిందంటే..
1974లో రామోజీరావు ఆధ్వర్యంలో ఈనాడు పత్రిక ప్రారంభమైంది. అంటే అప్పట్లో ఈనాడు ఇప్పట్లా ఉండేది కాదు. తెలుగు జర్నలిజం లో ఈనాడు ఒక సంచలనం. గజ్జల మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఆ పత్రిక ఎన్నో సంచలనాలకు కారణమైంది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బట్టలు విప్పి నడి బజార్లో నిలబెట్టింది. ఎంతోమంది ఉద్దండ పాత్రికేయులకు బతుకును, భవితను, భరోసాను ఇచ్చింది. అప్పట్లో ఈనాడు పత్రికలో ఏబీకే ప్రసాద్ పనిచేసేవారు.. ఆయన రాతలు నిర్మోహమాటంగా ఉండేవి. రాజంగానే ఏబికే ప్రసాద్ కు దూకుడు ఎక్కువ. పైగా విషయపరిజ్ఞానం నిండుగా ఉన్నవాడు. మెండుగా రాతలు రాసే దమ్మున్న వాడు. మొదట్లో ఇది రామోజీరావుకు బాగా నచ్చేది. కానీ ఎందుకనో తర్వాత తర్వాత ఇద్దరి మధ్య విషయపరమైన భేదాభిప్రాయాలు మొదలయ్యాయి. దీనికి తోడు అప్పట్లోనే దాసరి నారాయణరావు తెలుగు చిత్ర పరిశ్రమను ఏలుతున్నాడు. ఒక కులానికి మాత్రమే పరిమితమైన తెలుగు చిత్ర పరిశ్రమను తన వద్దకు తెచ్చుకోవడంలో సఫలీకృతుడయ్యాడు. అంతేకాదు హిట్ల మీద హిట్ల కొడుతూ మోస్ట్ వాంటెడ్ దర్శకుడు కం నటుడు అయ్యాడు. ఇక అప్పట్లోనే దాసరి నారాయణరావు సినిమాలకు సంబంధించి వార్తలు తప్ప ఆయన పేరు, ఫోటో ఉండకూడదని ఈనాడు పత్రికలో పైనుంచి ఆదేశాలు వచ్చాయి. ఇది సహజంగానే ఏబీకే ప్రసాద్ కు నచ్చలేదు. అటు దాసరి నారాయణరావు కూడా ఈ విషయం తెలియడంతో ఆయనకు కూడా రామోజీరావు అంటే కోపం ఏర్పడింది. ఈనాడు పత్రిక సూపర్ హిట్ కావడంతో రామోజీరావు లో మరో కోణం తెరపైకి వచ్చింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో కలహాలు ఉండేవి. ఇలాంటి పార్టీ రాష్ట్రానికి అవసరమా అని ఆయనకి అనిపించింది. ఆ తర్వాత ఎన్టి రామారావు పార్టీ పెట్టడంతో.. ఈనాడు పత్రిక ఆయనకు అనుకూలంగా రాతలు రాయడం మొదలుపెట్టింది. ఎన్టీ రామారావు తెలుగు రాష్ట్రానికి కావలసిన సరుకు అనే విధంగా ఒక తీపి పొట్లంలో పెట్టినట్టు ఈనాడు వార్తలు రాసేది. అయితే రామోజీరావు మీద అటు ఏబికె ప్రసాద్ కు, ఇటు దాసరి నారాయణరావుకు కోపం ఉండేది. అధి కాస్త పోటీ పత్రిక పెట్టేందుకు కారణమైంది.
సరిగా 1984 డిసెంబర్ 29 నాడు ఉదయం పత్రిక ప్రారంభమైంది. దానికి దాసరి నారాయణరావు చైర్మన్. ఏ బి కే ప్రసాద్ ఎడిటర్.. పతంజలి, దేవి ప్రియ, ఆర్టిస్ట్ మోహన్, వెంకటేష్ వంటి లబ్ద ప్రతిష్టులైన వ్యక్తులతో ఉదయం ప్రారంభమైంది. పూర్తి కంప్యూటరైజ్డ్
పేపర్ గా వినతికి ఎక్కింది. అనతి కాలంలోనే ఈనాడును దాటేసింది. ఎటువంటి అడ్డంకులు లేకుండా వార్తలు రాయగలిగే రిపోర్టర్లు.. వాటిని తీర్చి దిద్దగలిగే సబ్ ఎడిటర్లు.. నైపుణ్యమున్న ఫోటోగ్రాఫర్లు.. దమ్మున్న మేనేజ్మెంట్ తో రెండు లక్షల కాపీలకు పైగా సర్కులేషన్ తో ఉదయం ఒక బెంచ్ మార్కును సృష్టించింది. ఎన్టీ రామారావు మీద వ్యతిరేక వార్తలు, ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ ఆర్థిక అవకతవకలు, కాంగ్రెస్ పార్టీ గ్రూప్ రాజకీయాలు, తెలుగుదేశం పార్టీ కుల సమీకరణాలు.. ఒక్కటేమిటి ప్రతి విషయాన్ని ఉదయం స్పృశించింది.. స్ఫురించింది.
ప్రచురించింది. మేనేజ్మెంట్ అపరిమితమైన స్వేచ్ఛ ఇవ్వడంతో దుమ్ములేపే వార్తలు రిపోర్టర్లు రాయగలిగే వారు. తెలుగు పాఠకుల్లో ఒక ఆసక్తిని పాదుకొల్పేవారు. ఇలా ఉదయం సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఒకరకంగా ఉదయం ఏర్పాటుకు రామోజీరావు కారణమైతే.. దానిని సంచలనంగా మార్చేందుకు ఆయన బాధిత జర్నలిస్టులు కారణం. ఫలితంగా ఉదయం రివ్వున ఎగిరి తెలుగు జర్నలిజంలో సరికొత్త చరిత్రను సృష్టించింది. రామోజీరావుకు నిద్రలేని రాత్రులను పరిచయం చేసింది. అంతటి చరిత్రకు కారణమైన ఉదయం తర్వాత అంతర్దానం అయిపోయింది.. ఈరోజుకు ఉదయం పత్రిక లేకపోయి ఉండవచ్చు గాక.. కానీ ఒక 40 సంవత్సరాల క్రితం అది ఒక సంచలనం.. నాడు అందులో పని చేసిన జర్నలిస్టులకు అది ఒక కార్య స్థలం.. నేటికీ ఉదయాన్ని తలుచుకుంటే రామోజీరావు ఇబ్బంది పడతాడు.. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఒక నిర్వేదంలోకి వెళ్లి పోతాడు. అది చాలదా ఉదయం ఏ స్థాయిలో ఆయన మీద ప్రభావం చూపిందో చెప్పడానికి..