Praja Palana: రాజకీయ పార్టీలు తమ అధికారం కోసం ప్రవేశపెడుతున్న పథకాలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో అలవికాని హామీలు ఇచ్చి.. తర్వాత వాటి అమలులో షరతులు విధిస్తుండడంతో ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం వాటిని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా 2500 పింఛన్, గృహ జ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, సబ్సిడీ గ్యాస్ సిలిండర్, వంటి పథకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ దరఖాస్తులను స్వీకరించేందుకు గ్రామాలలో ప్రజాపాలన పేరుతో గ్రామసభలు నిర్వహిస్తున్నది.
గతంలో పాలించిన భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడం.. రైతు బంధు పథకాన్ని కొందరికి మాత్రమే పరిమితం చేయడంతో.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. చాలామంది ప్రజలు దరఖాస్తులు చేసుకునేందుకు పోటీలు పడుతున్నారు. ప్రభుత్వం ఆశించిన దానికంటే ఎక్కువ స్థాయిలో దరఖాస్తులు వస్తున్నాయి. పైగా ప్రజాపాలన గ్రామసభలకు భారీగా జనం పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో వారి నుంచి దరఖాస్తులు స్వీకరించడం అధికారులకు ఒక సవాలుగా మారుతుంది. ఈ క్రమంలో అధికారులకు దరఖాస్తులు సమర్పించేందుకు ఉదయం నుంచే ప్రజలు బారులు తీరి కనిపిస్తున్నారు. అంతేకాదు దరఖాస్తులు ఇచ్చేందుకు పోటీ పడుతుండడంతో కింద పడుతున్నారు. ఇందులో మహిళలు కూడా ఉన్నారు. ఇలా తొక్కిసలాటకు గురై మహిళలు గాయపడుతున్నారు.
తాజాగా ఓ గ్రామంలో ప్రజా పాలన సభ నిర్వహిస్తే దరఖాస్తులు ఇచ్చేందుకు ప్రజలు పోటీలు పడ్డారు.. ఉదయాన్నే ప్రభుత్వ కార్యాలయానికి రావడంతో జనం రద్దీని నివారించేందుకు ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. అందులో దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన వారందరిని ఉంచారు. ఉదయం 10 గంటల తర్వాత ఆ గది తలుపు తెరవడంతో జనం ఒకసారిగా బయటికి రావడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కొందరు మహిళలు కింద పడ్డారు. అందులో కొంతమంది చంటి బిడ్డల తల్లులు కూడా ఉన్నారు. దీనిని ఎవరో ఒక ఔత్సాహికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు వస్తుందని అందరూ అన్నారు. ఆ మార్పు ఇదే అని కామెంట్లు చేస్తున్నారు. పథకాల పేరుతో ప్రజలకు ఆశపెట్టి చివరికి ఇలా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు వారికి తగిన విధంగానే కౌంటర్ ఇస్తున్నారు. భారత రాష్ట్ర సమితి అధికారులు ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇచ్చి ఉంటే ప్రజలకు ఈ దుస్థితి వచ్చేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకు నిదర్శనమే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో.
ప్రజాపాలన దరఖాస్తుల కోసం తన్లాట. pic.twitter.com/davTHmmeAl
— Telugu Scribe (@TeluguScribe) December 30, 2023