https://oktelugu.com/

Kandikonda Gutta: అరుదైన మొక్కలకు నిలువెత్తు “కొండ”.. రేవంత్ సర్కారు ఒక్కసారి దృష్టిసారిస్తే.. తెలంగాణ మరో కేరళ..

మనదేశంలో అచంచలమైన ప్రకృతి సంపదకు నిలువెత్తు నిదర్శనమైన ప్రాంతం ఏదంటే.. వెంటనే కేరళ గుర్తుకు వస్తుంది. అరుదైన వృక్షాలకు.. అద్భుతమైన ఆయుర్వేద సంపదకు ఆ రాష్ట్రం పేరుపొందింది. మనదేశంలో ఆయుర్వేదానికి క్యాపిటల్ సిటీగా కేరళ గుర్తింపు పొందింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 13, 2024 / 01:12 PM IST

    Kandikonda Gutta

    Follow us on

    Kandikonda Gutta: ఇతర రాష్ట్రాలలో కేరళ మాదిరిగా వృక్షాలు లేవా? అరుదైన ఆయుర్వేదిక మొక్కలు లేవా? ఆ ప్రాంతాలలో కేరళ మాదిరిగా వైద్య విధానాన్ని అభివృద్ధి చేయలేమా? అంటే ఈ ప్రశ్నలకు సాధ్యం అనే సమాధానాలు వస్తాయి. కానీ ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం వల్ల ఆయుర్వేదం అంతగా అభివృద్ధి చెందడం లేదు. అరుదైన వృక్షాల గొప్పతనం.. వాటి వల్ల ఉపయోగాలు మనుషులకు దక్కడం లేదు. కేరళ మాదిరిగానే తెలంగాణలోనూ అద్భుతమైన వృక్ష సంపద ఉంది. అచంచలమైన ఆయుర్వేద మొక్కలున్నాయి. కాకపోతే వీటిని సంరక్షించే బాధ్యత ముందుకు పడకపోవడంతో అవి అలానే ఉండిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో కురవి మండలంలోని కందికొండ గుట్ట ఉంది. ఈ గుట్ట విస్తారమైన వృక్ష సంపదకు నెలవు. ఇక్కడ ఆయుర్వేద మొక్కలు విపరీతంగా ఉంటాయి. అయితే వీటిని సంరక్షించే బాధ్యతలను ప్రభుత్వం చేపట్టకపోవడంతో వీటి ప్రయోజనం మనుషులకు దక్కకుండా పోతుంది.

    ఆహ్లాదకరమైన వాతావరణం

    కందికొండ గుట్ట ఆహ్లాదకరంగా ఉంటుంది.. ఈ గుట్ట పైన గుహలు ఉంటాయి. దేవాలయం, కోనేరు కూడా ఉంటాయి. ఈ గుట్టపై పూర్వకాలంలో కపిలవాయి మహాముని, స్కంద మహాముని తపస్సులు చేసినట్టు తెలుస్తోంది. వారు తమ తపస్సు కోసం ఆయుర్వేద మొక్కలు, వనమూలిక సంబంధమైన మొక్కలను పెంచినట్టు తెలుస్తోంది. ఇప్పటికి కొండ పై భాగంలోకి వెళ్ళగానే ఆ మొక్కలు సువాసన వెదజల్లుతూ ఉంటాయి. అందువల్ల భక్తులకు ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది.. ఈ గుట్టపై ఉన్న కోనేరులో ప్రధానంగా నాలుగు రకాల మొక్కలు కనిపిస్తాయి. వాటిని రక్తజడ, ఈరజడ, అంతర దామెర, మద్దెడ అని పిలుస్తారు. ఈ మొక్కలు ఆకులను భక్తులు తీసుకెళ్తారు. ఇది మాత్రమే కాకుండా రాజహంస, పరమహంస, పంది చెవు చెట్టు, నల్ల ఉసిరి, అడవినిమ్మ, బుర్ర జెమిడి నల్లవాయిలి, బండ పువ్వు వంట చెట్లు కూడా ఉంటాయి.. ఇవి మాత్రం కాకుండా నాగసారం గడ్డ, నేల ఏనుగు మొక్కల ఆకులను రైతులు తమ పశువుల కోసం తీసుకెళ్తుంటారు. వీటివల్ల పశువులకు రోగాలు తగ్గుతాయని రైతులు నమ్ముతుంటారు. ఈ గుట్టపై ఉన్న కొండమామిడి చెట్టు బెరడును కాళ్లు, చేతులు విరిగిన వారికి కట్టు కడుతుంటారు. పాంద గరుగుడు చెక్క, నల్లెడ తీగ, బురుదొండ, అడవి దొండ లాంటి మొక్కలు కూడా ఈ గుట్టపై ఉన్నాయి.. చేగుండాకు, ఉప్పు చెక్క, మచ్చుతునక, కలములక, సోమడి చెక్క వంటి అరుదైన మొక్కలు కూడా ఈ గుట్టపై ఉన్నాయి. ఆయుర్వేద వైద్యుల పరిశోధన ప్రకారం కేరళ రాష్ట్రంలో లభించడం మొక్కలు కూడా ఇక్కడ పెరుగుతాయట. అక్కడినుంచి వైద్యులు ఇక్కడికి వచ్చి ఈ ఆకులను తీసుకెళ్లి ఔషధాలు తయారు చేస్తారట.. గుప్త రోగాలను నయం చేసే మొక్కలు కూడా ఇక్కడ ఉన్నాయట.. ప్రభుత్వం దృష్టి పెట్టి ఇక్కడ ఆయుర్వేద వైద్యశాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.. ఇక ఆయుర్వేద వైద్యులు ఇక్కడి ఆకులను సేకరించి.. ఔషధాలు తయారుచేసి చెన్నై, ముంబై, సింగపూర్, ఢిల్లీ ప్రాంతాలలో విక్రయిస్తున్నారు.. ఇక ఈ గుడిపై ప్రతి కార్తీక పౌర్ణమి సందర్భంగా జాతర జరుగుతుంది. ఆరోజున స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం జాతర జరుగుతుంది.