తెలంగాణలో గత 20 రోజులుగా అమలవుతున్నలాక్ డౌన్ తో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ర్టంలో పాజిటివిటీ రేటు 2 శాతానికి పడిపోయింది. గడిచిన 24 గంటల్లో 2261 కేసులు నమోదయ్యాయి. 18 మంది మృతి చెందారు. 3043 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు రాష్ర్ట వైద్య,ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. సాధారణంగా 5 శాతం కన్నా తక్కువ కోవిడ్ పాజిటివిటీ రేటు ఉంటే లాక్ డౌన్ ఎత్తేసే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణలో అది 2 శాతానికి పడిపోవడంతో లాక్ డౌన్ ఎత్తివేసే సూచనలున్నాయి.
ప్రస్తుత లాక్ డౌన్ జూన్ 9 వరకు ఉంటుంది. వచ్చే వారంలో కేసుల సంఖ్య తగ్గితే లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశం ఉంది. రాష్ర్టవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి కరోనా పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. గ్రామాల్లో లాక్ డౌన్ కఠినంగా అమలు చేసేలా చర్యలు ఉంటాయి. ప్రస్తుతం 55 వేలకుపైగా పడకలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
రాష్ర్ట వ్యాప్తంగా రెండో విడతలో చేసిన సర్వేలో 87,49,549 ఇళ్లల్లో సర్వే చేశారు. సర్వేలో 4037మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. కొన్నిచోట్ల మూడో దశ ఇంటింటి సర్వే చేస్తున్నామని చెప్పారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం రాష్ర్టంలో 9 లక్షల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ లో 72,మేడ్చల్ 48,రంగారెడ్డిలో 37 ఆస్పత్రులపై ఫిర్యాదులు వచ్చాయి.
రాష్ర్టంలో గత 10 రోజులుగా బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 1100 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే అంపోటెరిసిన్ బి,లీపాసోమల్ మందులకసం రోగుల కుటుంబసభ్యులు, బంధువులు కోఠిలోని ప్రజారోగ్య కార్యాలయానికి వచ్చి తీసుకెళ్లాలి.