Rythu Bharosa: కౌలు రైతులకూ ‘రైతు భరోసా’.. వర్తించాలంటే ఇలా చేయాలి..

Rythu Bharosa: తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ‘రైతు బంధు’ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఎకరాకు రూ.5 వేల చొప్పున ఏడాదికి రెండు సార్లు పెట్టుబడి సాయం అందిస్తున్నారు.

Written By: Srinivas, Updated On : July 6, 2024 10:58 am

Telangana Rythu Bharosa

Follow us on

Rythu Bharosa: తెలంగాణలో ఇప్పుడు రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలపై హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. రైతు రుణ మాఫీ పథకాన్ని ఆగస్టు 15 లోగా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గత పార్లమెంట్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణను మొదలుపెట్టారు. అయితే ఇప్పడు రైతు భరోసాపై కూడా నిన్న సమావేశం నిర్వహించారు. త్వరలోనే రైతుభరోసా మొత్తాన్ని రైతులకు సాయం చేయనున్నారు. ఈ సందర్భంగా భూ యజమానులతో పాటు కౌలు రైతులకూ ‘రైతు భరోసా’ వర్తింపచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇది వర్తించాలంటే ఓ షరతును కూడా పెట్టారు. అదేంటంటే?

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ‘రైతు బంధు’ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఎకరాకు రూ.5 వేల చొప్పున ఏడాదికి రెండు సార్లు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. అయితే 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ‘రైతు బంధు’ను ‘రైతు భరోసా’గా పేరు మార్చింది. అ పథకాన్ని అలాగే కొనసాగిస్తోంది. అయితే రైతు బంధు లో అక్రమాలు జరిగాయని, అందులో ప్రక్షాళన చేపడుతామని కాంగ్రెస్ నాయకులు ఇదివరకే చెప్పారు. ఇందులో భాగంగా శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

రైతు భరోసాను కేవలం 5 ఎకరాల వరకే ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే మరోసారి కేబినెట్ భేటీ తరువాత ఫైనల్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు. అలాగే జూలై 11 నుంచి 15 వరకు మరోసారి గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు. అయితే 5 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వడం వల్ల కేవలం 7 శాతం మంది రైతులు మాత్రమే ఈ స్కీం నుంచి తొలగిపోతారు. దీంతో పెద్దగా నష్టం ఏముండదనే అభిప్రాయానికి వచ్చారు.

ఇదే సమయంలో కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వడంపై చర్చించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీని అమలు చేయాలనే చర్చ వచ్చింది. ఇకవేళ కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వాలనుకుంటే మాత్రం ఒక షరతు విధించాలని అంటున్నారు. భూ యజమానుతో కౌలు రైతు అగ్రిమెంట్ చేసుకున్న తరువాతే వారికి ఏడాదికి ఎకరానికి రూ.15 వేల చొప్పున అందించే అవకాశం ఉందన్నారు. అయితే దీనిపై కూడా ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.