HomeతెలంగాణTelangana Politics: ‘చేతి’కి చిక్కుతున్న బల్దియాలు.. చేష్టలుడిగి చూస్తున్న గులాబీ నేతలు!

Telangana Politics: ‘చేతి’కి చిక్కుతున్న బల్దియాలు.. చేష్టలుడిగి చూస్తున్న గులాబీ నేతలు!

Telangana Politics: తెలంగాణలో పదేళ్లు పాలించిన.. పింక్‌ పార్టీకి పారాభవాల పరంపర కొనసాగుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌ను ఇంటికి పంపించారు. ఇక తాము అధికారంలో ఉన్నప్పుడు గెలిచిన మున్సిపాలిటీలు కూడా ఇప్పుడు జారిపోతున్నాయి. అయినా నిస్సహాయంగా ఆ పార్టీ నేతలు చేష్టలుడిగి చూస్తున్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో దిగువస్థాయి నేతలు కూడా అధికార పార్టీవైపు చూస్తున్నారు. మున్సిపాల్టీల్లో క్యాడర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైపు వెళ్తోంది. ఫలితంగా స్థానిక సంస్థల్లో అధికారం ‘చేతి’కి చిక్కుతోంది. గులాబీ పార్టీని వీడుతున్నవారిని ఆపలేని నిస్సహాయస్థితిలో ఆ పార్టీ నేతలు ఉన్నారు.

పోతే పోనియ్‌ అన్నట్లుగా..
బీఆర్‌ఎస్‌కు క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్‌ ఉంది. కానీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో క్యాడర్‌లో ఆత్మస్థైర్యం దెబ్బదింది. బీఆర్‌ఎస్‌ను పట్టుకుని ఉంటే ఇక లాభం ఉండదని భావిస్తున్న స్థానిక సంస్థల నేతలు.. అధికార పార్టీవైపు చూస్తున్నారు. బహిరంగంగానే కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. అయినా బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు కూడా వారిని బుజ్జగించే ప్రయత్నం చేయడం లేదు. పోతే పోనియ్‌ అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 40కిపైగా మున్సిపాలిటీల్లో చైర్మన్, మేయర్లు, వైస్‌ చైర్మన్లపై అవిశ్వాసం ప్రకటించారు.

అసెంబ్లీ ఎన్నికల వేళనే..
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలకు చెందిన బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. సొంత పార్టీలోని అసమ్మతి కారణంగా ఆ పార్టీ కౌన్సిలర్లు కూడా అవిశ్వాసం కోసం విపక్షంతో చేతులు కలుపుతున్నారు. అవిశ్వాసాలకు మద్దతు ఇస్తున్నారు. స్థానిక అధికారం చేతికి వస్తుండడంతో పదవుల కోసం కాంగ్రెస్‌ కౌన్సిలర్లు పోటీ పడుతున్నారు. మూడేళ్లపాటు విపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ఇప్పుడు తమకు అధికారం కవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు కూడా ద్వితీయశ్రేణి నేతల పదవులు కాపాడలేకపోతున్నారు.

బలహీనపడుతున్న క్యాడర్‌..
కిందిస్థాయి నేతలు, ప్రజాప్రతినిదులు బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెబుతుండడంతో ఆ పార్టీ క్యాడర్‌ క్రమంగా బలహీనపడుతోంబది. పార్లమెంట్‌ ఎన్నికల వేళ ఇది బీఆర్‌ఎస్‌కు ఇబ్బందిగా మారుతుందని పార్లీ సీనియర్లతోపాటు, రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి బీఆర్‌ఎస్‌కు సొంత క్యాడర్‌ 20 శాతం లోపే.. మిగతా క్యాడర్‌ అంతా పక్క పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన వాళ్లే. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీలను ఎలా ఆకర్షించారో.. ఇప్పుడు కాంగ్రెస్‌ నేతలు కూడా అదేవిధంగా చేస్తున్నారు. రాజకీయాల్లో సిద్ధాంతం పరంగా ఉండే క్యాడర్‌ను ప్రోత్సహించడంతో బీఆర్‌ఎస్‌ విఫలమైంది. పక్కపార్టీల నుంచి వచ్చిన వారికే పదవులు ఇచ్చింది. దీంతో సొంత క్యాడర్‌తోపాటు పదవులు వచ్చిన వారు కూడా అధికారం కోసం పార్టీని వీడుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version