New Ration Cards: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో రేవంత్ సర్కార్ రేషర్ కార్డుల జారీకి కసరత్తు చేస్తోంది. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ తెలంగాణలో కొత్త రేషన్‌కార్డులు జారీ చేయలేదు. ఈ క్రమంలో రేవంత్ సర్కార్‌పై పేదలు ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి త్వరలో అర్హులకు రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. దీంతో పేదల్లో ఆశలు చిగురించాయి.
10 లక్షల దరఖాస్తులు..
తెలంగాణలో ప్రస్తుతం 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. దరఖాస్తుల కోసం పోర్టల్ ఓపెన్ చేస్తే మరో 10 లక్షల దరఖాస్తులు వస్తాయని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కొత్త కార్డుల జారీకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే పోర్టల్ ఓపెన్ చేసేందుకు పౌర సరఫరాల అధికారులు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు పెళ్లయినా పాత కార్డుల్లోనే ఉన్నవారు, కొత్త జంటలకు వేరుగా కార్డులు జారీ చేసేందుకు కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
విధి విధానాలపై కసరత్తు
మీ సేవలో మెంబర్ అడిషన్ పోర్టల్ ఓపెన్ చేసి ఉంది. దీంట్లో ఇప్పటి వరకు 11 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది, కొత్త కార్డులు ఇచ్చే సమయంలోనే.. మెంబర్ అడిషన్‌పై కూడా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈ రెండు ప్రక్రియలూ పూర్తిచేస్తే రేషన్ కార్డుల సమస్య దాదాపుగా కొలిక్కివచ్చే అవకాశాలున్నాయి. ప్రభుత్వ పథకాల లబ్ధికి రేషన్ కార్డు తప్పని సరి చేసే ఆలోచన ఉన్న నేపథ్యంలో రేషన్ కార్డు పొందేందుకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని తెలుస్తోంది.