Homeటాప్ స్టోరీస్Journalists are needed: మీ పిచ్చి కాకపోతే స్టేటస్ లు పెట్టుకుంటే పొలోమని రేపటి జర్నలిస్టులు...

Journalists are needed: మీ పిచ్చి కాకపోతే స్టేటస్ లు పెట్టుకుంటే పొలోమని రేపటి జర్నలిస్టులు వచ్చేస్తారా?

Journalists are needed: రైల్వే శాఖ లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేస్తే తామర తంపరగా దరఖాస్తులు వచ్చేస్తుంటాయి. భర్తీ చేసే ఉద్యోగాల కంటే దరఖాస్తులు ఎక్కువగా ఎందుకు వస్తాయి అంటే.. రైల్వే శాఖ అనేది కేంద్రం ఆధీనంలో ఉంటుంది. రైల్వే శాఖలో కల్పించే ఉద్యోగానికి భద్రత ఉంటుంది.

పోలీస్ శాఖ భర్తీ చేసే ఉద్యోగాలకు ప్రకటన విడుదలయితే భారీగా దరఖాస్తులు వస్తుంటాయి. దానికి కారణం ఉద్యోగ భద్రతే. ఎందుకంటే ప్రతి నెల మొదటి తారీఖు జీతం వస్తుంది. కార్మిక చట్టాలకు అనుగుణంగా చెల్లింపులు ఉంటాయి. ఇతర భత్యాలు లభిస్తుంటాయి.

ఇవే కాదు ప్రభుత్వ ఆధ్వర్యంలో భర్తీ చేసే ఉద్యోగాలకు ఎవరూ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే అవి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటాయి కాబట్టి. ఇక మనదేశంలో పేరుపొందిన కార్పొరేట్ సంస్థలు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నప్పుడు ప్రకటనలు విడుదల చేస్తుంటాయి. వాటికి కూడా భారీగానే దరఖాస్తులు వస్తుంటాయి. కారణం ఆ కంపెనీల చరిత్రే. ఇక మన తెలుగులో మీడియా సంస్థల విషయానికి వస్తే ఓ ప్రఖ్యాత మీడియా సంస్థ ప్రకటన విడుదల చేస్తే భారీగా దరఖాస్తులు వెళ్తుంటాయి. అందులో పని చేయడానికి చాలామంది గర్వంగా భావిస్తుంటారు. ఎందుకంటే జీతాలు, ఇతర భత్యాలు అందులో బాగుంటాయి. అందువల్లే అందులో పని చేయడానికి చాలామంది ఇష్టపడుతుంటారు.

ఇప్పుడు తెలుగు మీడియాలో జర్నలిస్టులు కావలెను అని ఓ మీడియా సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో ప్రతినెల 12000 ఇస్తామని, ట్రైనింగ్ పూర్తయిన తర్వాత 16 నుంచి 18 వేల వరకు జీతం ఇస్తామని.. ఇతర విభాగాలలో గనక ఎంపికైతే 20000 వరకు వేతనం ఇస్తామని ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. సాధారణంగా ఇప్పుడున్న కాలంలో చాలామందికి ఉద్యోగాలు లేవు. చదువులు పూర్తయినా సరే ఉద్యోగాలు లేక చాలామంది నరకం చూస్తున్నారు. అలాంటివారికి ఈ ప్రకటన ఒక సంజీవని లాంటిది. అయితే ఉద్యోగం అనేది మన ఎదుగుదలలో కీలకపాత్ర పోషించాలి. అందులో ఎదుగుదల కూడా ఉండాలి. అదేదీ లేకుండా కేవలం చాకిరి చేయించుకోవడానికే ప్రకటన ఇస్తే దానివల్ల యాజమాన్యం లక్ష్యాలు నెరవేరుతాయేమో గాని.. ఆ ఉద్యోగాన్ని నమ్ముకున్న ఉద్యోగుల అంచనాలు మాత్రం నెరవేరవు. పైగా ఆ మీడియా సంస్థ లో జీతాలు అందరికీ తెలుసు. అందులో ఏ స్థాయిలో ఒత్తిడి ఉంటుందో కూడా తెలుసు. అందువల్లే చాలామంది యువకులు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తిని ప్రదర్శించడం లేదు. దీంతో ఆ మీడియా సంస్థ తన కంపెనీలో పని చేస్తే ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది.

Also Read: ఈ ఒక్క ఫోటో తెలంగాణ బీజేపీని షేక్ చేసింది

“ప్రస్తుతం మనం జర్నలిస్టులు కావలెను అని ఒక ప్రకటన ఇచ్చాం.. ఆ ప్రకటనను మీ వాట్సాప్ స్టేటస్ లలో పెట్టుకోండి.. దానివల్ల చాలామంది ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. తద్వారా దరఖాస్తులు ఎక్కువగా వస్తాయి. మంచి టీమ్ ను ఎంపిక చేసుకుని అవకాశం ఉంటుంది” అని మేనేజ్మెంట్ ఆర్డర్ ఇవ్వగానే.. ఉద్యోగులు మొత్తం ఆ పని చేశారు.. వాస్తవానికి రెండు రోజుల గ్యాప్ తో ఆ మీడియా సంస్థ ప్రచురించే పత్రిక చివరి పేజీలో ఆ ప్రకటనను అచ్చు వేస్తోంది. ఆ స్థాయిలో ప్రచారం చేసినప్పటికీ దరఖాస్తులు రావడంలేదంటే.. ఆ సంస్థ మీద యువకులకు ఏ స్థాయిలో నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ దింపుడు కల్లం ఆశలాగా ఆ మీడియా సంస్థ ఉద్యోగులతో ఈ ప్రయత్నం చేయించడం నిజంగా హాస్యాస్పదం.” మాతో పేపర్ సర్కులేషన్ చేయిస్తున్నారు. యాడ్స్ తెప్పిస్తున్నారు. ఇక మిగతా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంత చాకిరీ చేస్తుంటే చివరికి వాట్సాప్ స్టేటస్ లో ఈ ప్రకటన పెట్టుకోమంటున్నారు. కొద్దిరోజులు పోతే ఇంకా ఎంత చాకిరి చేయిస్తారో అర్థం కావడంలేదని” ఆ మీడియా సంస్థల పని చేసే సిబ్బంది వ్యాఖ్యానిస్తూ ఉండడం ఇక్కడ కొసమెరుపు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular