iBomma Ravi Latest Updates: ఐటీ విభాగంలో పనిచేసే వారంతా జాగ్రత్తగా ఉంటారు. తమ ఫోన్ నుంచి మొదలుపెడితే వస్తువుల వరకు ప్రతి విషయంలోనూ ముందుచూపుతో ఉంటారు. అటువంటి వ్యక్తులను పట్టుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే వారు ప్రతి విషయాన్ని కూడా అత్యంత స్మార్ట్ గా ఆలోచిస్తుంటారు. అలాంటిది ఎథికల్ హ్యాకర్ అయినటువంటి ఐ బొమ్మ రవి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి.. అందువల్లే సంవత్సరాలుగా అతనిని పట్టుకోవాలని.. అతడి సైట్ ప్రస్థానాన్ని ముగించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ ఉపయోగం ఉండడం లేదు. అటువంటిది ఐ బొమ్మ రవిని ఇండియాకు రాగానే పోలీసులు పట్టుకోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఒక సంచలన నిజం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
ఐ బొమ్మ రవి తన వెబ్సైట్ కార్యకలాపాలను కరేబియన్ దీవుల వేదికగా నిర్వహిస్తున్నాడు. చాలా రోజులుగా అతడు అక్కడే ఉంటున్నాడు. ఇటీవల కాలంలో పోలీసులు అతడి సైట్ మీద దృష్టి సారించడంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు. ఇతర దేశాలకు రోజుల వ్యవధిలో వెళ్ళాడు. ఐపీ అడ్రస్లు మార్చాడు. పోలీసులను ఏ మార్చాడు. అయితే పోలీసులు తనను ఏమీ చేయలేరని ఒక అంచనాకు వచ్చిన రవి.. ఆ తర్వాత ఇండియాకు వచ్చాడు. కానీ ఇక్కడే రవి పోలీసులను తక్కువ అంచనా వేశాడు.
రవి గురించి కొంతకాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్న తెలంగాణ పోలీసులు అతని స్నేహితుడి ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ఆ తర్వాత దానిని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇటీవల ఫ్రాన్స్ నుంచి రవి ఇండియాకు వచ్చాడు. ఇండియాకు వచ్చిన తర్వాత తాను ఉండే ప్లాట్ కు రావాలని స్నేహితుడి ఫోన్ నెంబర్ కు మెసేజ్ చేశాడు. అప్పటికే ఆ ఫోన్ నెంబర్ పోలీసుల ఆధీనంలో ఉండడంతో వెంటనే అలెర్ట్ అయ్యారు. అతడు మెసేజ్ పంపిన లొకేషన్ ను గుర్తించారు. మఫ్టీ లో రవి ఉండే నివాసం వద్దకు వెళ్లారు. అతడిని అరెస్టు చేసి కస్టడీకి తీసుకున్నారు..
ఐటీ బొమ్మ రవి కస్టడీ సోమవారంతో ముగియబోతోంది. అయితే ఇప్పటివరకు అతడు వెబ్సైట్లకు సంబంధించి ఎటువంటి కీలక సమాచారాన్ని చెప్పలేదు. దీంతో కోర్టులో హాజరు పరిచి మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు అడిగిన అనేక ప్రశ్నలకు దాటవేత ధోరణి ప్రదర్శించిన రవి.. రెండోసారి కస్టడీలోకి తీసుకుంటే మాత్రం నిజాలు చెబుతాడా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రవికి అనుకూలంగా ఇప్పటికే సోషల్ మీడియాలో మీమ్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. రవికి అనుకూలంగా కొంతమంది ఆటోల మీద రాతలు కూడా రాస్తున్నారు. ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.