Hydra: హైదరాబాద్ మహానగరంలో ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రా పై జరుగుతున్న ప్రచారం పరిధులు దాటిపోయింది. రాష్ర్రంలోని అన్ని ప్రాంతాల్లో ఎక్కడ ఆక్రమణలు ఉంటే అక్కడ హైడ్రా వస్తుందని, కూల్చేస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ అడ్డగోలు ప్రచారంతో ఆందోళనకు లోనై కూకట్ పల్లి లో మహిళ ఆత్మహత్య లాంటి ఘటనలకి ఆస్కారం ఏర్పడుతోంది. జిల్లాల్లోనూ చెరువుల్లో ఆక్రమణలు, ప్రభుత్వ స్థలాల కబ్జాల తొలగింపునకు హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తుందే తప్ప హైడ్రాకి అక్కడ నిర్మాణాలని తొలగించే అధికారం లేదు. హైదరాబాద్ లోనే మరోవైపున సాగుతున్న మూసీ ఆక్రమణల తొలగింపు లోనూ హైడ్రా కి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాలపైనా, హైడ్రా పరిధిపైనా అందరూ అవగాహన కల్పించుకోవాల్సి ఉంది.
■ హైడ్రా పవర్స్ ఔటర్ వరకే:
తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన హైడ్రా ఔటర్ రింగ్ రోడ్డుకు లోపలున్న ప్రాంతంలోని చెరువుల, నాళాల, ప్రభుత్వ భూముల్లోని ఆక్రమణలను తొలగించే అధికారం కలిగి వుంది. పవర్ ఫుల్ ఐపీఎస్ అధికారి ఏ.వీ. రంగనాథ్ ని హైడ్రా కమిషనర్ గా ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్ మహానగరంలో చెరువుల , నాళాలు, ప్రభుత్వ భూములు, స్థలాలు,ఆస్తుల ఆక్రమణల తొలగింపుతో పాటు వాటి సంరక్షణ బాధ్యతల్ని చేపట్టేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అథారిటీ) ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని చెరువుల్లో ఉన్న అక్రమ నిర్మాణాలని హైడ్రా తొలగిస్తుండడంతో హైడ్రా పై ప్రచారం ఉధృతంగా సాగుతోంది. హైడ్రా కేవలం ఔటర్ లోపల పరిధి వరకే ఆక్రమణలను తొలగించే అధికారం కలిగివుంది.
■ మూసీ ఆక్రమణల తొలగింపు బాధ్యత రెవెన్యూశాఖకి అప్పగింత:
మూసీ నదిని సుందరీకరించే రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ లో భాగంగా మూసీ నదిలో ఉన్న ఆక్రమణలను తొలగించే కార్యాచరణ చేపట్టారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మూసీ ఆక్రమణలు గుర్తించే సర్వే, మార్కింగ్ బాధ్యతల్ని రెవెన్యూ శాఖకు అప్పగించారు. మూసీ నదిలో నిర్మాణాలు కోల్పోయి నిర్వాసితులయ్యేవారికి పునరావాసం కింద సిటీలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయిస్తున్నారు. నిర్వాసితులని అక్కడికి తరలించాకే ఈ ఆక్రమణలను తొలగిస్తున్నారు. రెవెన్యూ శాఖ నేతృత్వంలో పోలీసులు ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్నారే తప్ప హైడ్రాకి ఎలాంటి సంబంధం లేదు.
■ జిల్లాల్లోనూ హైడ్రా తరహా ఉండాలని డిమాండ్లే తప్ప కార్యాచరణ నిల్ :
హైడ్రాకి మంచి పబ్లిసిటీ వస్తుండడంతో ఆదిలాబాద్ మొదలు పాలమూరు వరకు అన్ని జిల్లాల్లో హైడ్రా తరహా వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు, పర్యావరణ వేత్తలు, సామాజిక వేత్తలు కోరుతున్నారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ వాస్తవాలను దృష్టిలో ఉంచుకొని సోషల్ మీడియాలో ప్రచారం.చేసేవారు జాగ్రత్తలు పాటించాలనే సూచనలు వస్తున్నాయి.