Musi River Pollution: కాలుష్య కాసారంగా మారిన మూసీ నది ని ప్రక్షాళన చేసేందుకు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. పూర్తి కాలుష్యమయమవడం వల్ల పరివాహక ప్రాంతాలైన గ్రేటర్ హైదరాబాద్, వికారాబాద్, యాదాద్రి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో మహిళలకు తీవ్రమైన సంతానలేమి సమస్య ఏర్పడుతోంది. అంతేకాదు.. ఈ నీటితో పండే వడ్ల ద్వారా వచ్చే బియ్యం, కూరగాయలు తిన్నా, ఈ నది నీటిలో పెరిగే చేపలు తిన్నా క్యాన్సర్, హృద్రోగ సమస్యలు, ఊపిరి తిత్తుల రోగాలు,చర్మవ్యాధులు సోకి చనిపోతున్న దృష్టాంతాలు ఎక్కువడంతో గత 40 ఏళ్లుగా మూసీని ప్రక్షాళన చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. మనుష్యులే కాదు మూసీ నీటినే అనివార్యంగా తాగే పశువులు కూడా రోగాల బారిన పడి చచ్చిపోతున్నాయి. ఈ బాధల నుంచి మూసీ పరివాహక ప్రజలకి విముక్తి కలిగేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
■ మూసీ నీరు తాగేవారిలో సంతానలేమి సమస్య గుర్తించిన శాస్త్రవేత్తలు:
కాలుష్యమయంగా మారిన మూసీ నది నీటిని సేవించే వారు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలపై అధ్యయనాలు నిర్వహించిన పలు సామాజిక సంస్థలు, మానవహక్కుల కమిటీలు, పౌర సంఘాలు ఇక్కడ అతి తీవ్రంగా పరిగణించాల్సిన సంతానలేమి సమస్య ఏర్పడిందని తేల్చారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కి ఈ సంఘాలు, శాస్త్రవేత్తలు తమ నివేదికలు అందజేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ నదీలోయ ప్రాంతంలో మానవ మనుగడకు, నాగరికత వృద్ధికి అవసరమైన సంతాన సృష్టి ఆగిపోతుంది అనే ఆందోళన ఆయా సంస్థలు వ్యక్తపరిచాయి. లేకపోతే కొన్ని దశాబ్దాలకు ఈ నదీపరివాహకం అంతా నిర్మానుష్యంగా, ఎడారిలా మారిపోతుందనే ఆందోళన వ్యక్తమైంది.
■ మూసీ కలుషితమయ్యేది ఇలా…
వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి పర్వతాల్లో పుట్టిన మూసీ నది వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్, యాదాద్రి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో 160 కిలోమీటర్లు ప్రవహించి నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలిస్తుంది. హైదరాబాద్ మహనగరం ఈ నది ఒడ్డునే ఉంది. నగరంలోని మురికి నీరంతా ఈ నదిలో చేరుతోంది. అంతే కాకుండా నది తీరంలో మేడ్చెల్, యాదాద్రి, వికారాబాద్, రంగారెడ్డి, సూర్యాపేట,నల్లగొండ జిల్లాలలో నెలకొల్పిన రసాయన పరిశ్రమలు వెదజల్లే వ్యర్ధ రసాయనాలు ఈ నదిలో కలుస్తున్నాయి. ఒకవైపు మహానగర మురికినీరు, మరోవైపున వ్యర్ధ రసాయనాల కలయికతో మూసినీరు పూర్తిగా కలుష్యమయంగా మారింది. ఈ కాలుష్యం వల్ల మూసీ నీటిలో క్యాడియం, కాపర్, క్రోమియం, ఆర్సెనిక్, జింక్, నైట్రేట్ వంటి మూలకాల శాతం ఎక్కువగా ఉండి ప్రమాదకర రోగాలు, జబ్బులకి దారి తీస్తోంది.
■ నగరంలో ప్రక్షాళనే కాదు, పరిశ్రమల వ్యర్ధాలూ కలవకుండా చర్యలుంటేనే తుది ఫలితం:
మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడాన్ని ఆహ్వానిస్తోన్న నదీపరివాహక ప్రజలు పరిశ్రమల వ్యర్ధ జలాలను నదిలో కలవకుండా నిరోధించే చర్యలనీ చేపట్టాలని సూచిస్తున్నారు. ఈ చర్యలు కూడా చేపడితేనే మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ లక్ష్యం నెరవేరి ప్రజలకి తుది ఫలితం దక్కుతుందని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే సూచనలు వస్తున్నాయి.