Hydra: కొంతకాలంగా హైడ్రా కూల్చివేతలకు పాల్పడడం లేదు. హైదరాబాదులో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కేవలం ముంపును తొలగించే పనులు మాత్రమే చేపడుతోంది. ఆదివారం వర్షం కాస్త తెరిపి ఇవ్వడంతో హైడ్రా తన విశ్వరూపాన్ని చూపించింది. ఉదయాన్నే జెసిబిలు, పెద్దపెద్ద వాహనాలతో గాజుల రామారావు ప్రాంతంలోకి రంగంలోకి దిగింది. తన పని మొదలుపెట్టింది ..
గాజులరామారం హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతాలలో ఒకటి. ఇక్కడ పరిశ్రమలు విస్తారంగా ఉంటాయి.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారు ఇక్కడ పరిశ్రమల్లో పని చేసుకుంటూ జీవిస్తున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని దాదాపు 300 ఎకరాల ప్రాంతాన్ని రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కు ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమి మొత్తం సర్వేనెంబర్ 307 లో ఉంది. బహిరంగ మార్కెట్లో 15 వేల కోట్ల వరకు ఈ భూమికి విలువ ఉంటుంది.
మేడ్చల్ మాల్కాజ్ గిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ మండలం పరిధిలోకి గాజులరామారం వస్తుంది. 15 వేల కోట్ల విలువైన ఈ భూమిలో ఇటీవల ఆక్రమణలు జరుగుతున్నాయి. కొంతమంది అక్రమార్కులు ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారు గృహాలు కూడా నిర్మించుకున్నారు. అయితే కబ్జాలను ముందుగానే నిర్ధారించుకున్న హైడ్రా నివాసాల జోలికి వెళ్లకుండా ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టింది. సర్వే నెంబర్ 307 లో ఉన్న ఈ 300 ఎకరాల భూమిని కాపాడే ప్రయత్నం చేసింది. పేదవారిని ముందు పెట్టి ఇక్కడ బడా బాబులు షెడ్లు నిర్మించారు. ఈ విషయాన్ని ముందే గుర్తించిన హైడ్రా.. భారీగా యంత్ర సామాగ్రితో కూల్చివేతల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఎప్పటిలాగానే గులాబీ పార్టీ అనుకూల మీడియా పేదల కోణంలో కన్నీరు కార్చడం ప్రారంభించింది. పేదల గృహాలను కూలగోడుతున్నారని కలరింగ్ ఇవ్వడం ప్రారంభించింది. వాస్తవానికి ఆ పేదలు బడా బాబులు హైడ్రా మీదికి ప్రయోగిస్తున్న పావులు. ఈ విషయాన్ని దాచిపెట్టి గులాబీ అనుకూల మీడియా బాధిత పక్షం లాగా మాట్లాడుతోంది ..
ఈ భూమిని గత ప్రభుత్వంలో పని చేసిన కొంతమంది కీలక నాయకులు ఆక్రమించారని స్థానికులు చెబుతున్నారు. పైగా ప్లాట్లుగా చేసి విక్రయించారని.. హైడ్రావచ్చి పని మొదలుపెట్టగానే అడ్డు తగులుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ హైడ్రా తన పని ఆపలేదు. పైగా మరింత దూకుడుగా ముందుకు వెళ్ళింది. అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. ఈ భూమి చుట్టూ కంచె వేయాలని హైడ్రా భావిస్తున్నది. దీనికి తగ్గట్టుగానే హైడ్రా ఫుల్ పోర్స్ తో దూసుకుపోతోంది.