KA Paul: కేఏ పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఆయన క్రైస్తవ మత బోధకుడిగా ఉండేవారు. ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు గాని ఆ స్థాయిలో మాత్రం కాదు. ఆయన ప్రసంగాలను వినడానికి ఒకప్పుడు లక్షల పదిమంది వచ్చేవారు. ప్రపంచ శాంతి మహాసభల పేరుతో అన్ని దేశాలలో ఆయన తిరిగారు. అన్ని దేశాల ఆధిపతులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. అప్పట్లో ఆయన అపాయింట్మెంట్ కోసం చాలామంది ఎదురు చూసేవారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో కీలక స్థానాలలో ఉన్న రాజకీయ నాయకులు మొత్తం ఒకప్పుడు పాల్ అపాయింట్మెంట్ కోసం ఎదురుచూసినవారే.
కాలం కలిసి రాకపోతే ఎవరికైనా సరే దురదృష్టం ఎదురు తంతుంది. దానికి కేఏ పాల్ మినహాయింపు కాదు. ఒకప్పుడు గొప్ప వక్తగా పేరుపొందిన ఆయన ఇప్పుడు కామెడీ పీస్ అయ్యారు. ఇలా రాస్తున్నందుకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ తప్పడం లేదు. ఎందుకంటే ఒకప్పటి మాదిరిగా ఆయనకు మాటమీద పట్టలేదు. విషయం మీద అదుపు లేదు. తర్కానికి దూరంగా మాట్లాడటం వల్ల ఆయనను అందరూ ఒక హాస్యనటుడిగానే చూస్తున్నారు. అది ఆయన అభిమానులకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ తప్పడం లేదు. పైగా ముఖాముఖి.. ఇతర కార్యక్రమాలలో కేఏ పాల్ మాట్లాడుతున్నప్పుడు విచిత్రమైన హావభావాలను ప్రదర్శిస్తుంటారు. విషయంతో సంబంధం లేకుండా మాట్లాడుతుంటారు. దానివల్ల మిగతా వాళ్లకు ఆయన వ్యక్తిత్వంపై చులకన భావం ఏర్పడుతోంది. ప్రజాశాంతి పేరుతో పార్టీ ఏర్పాటు చేసినప్పటికీ ఇంతవరకు ఏ ఎన్నికల్లోను ఆ పార్టీ గెలవకపోవడం విశేషం.
విభిన్నమైన సమస్యల మీద మాట్లాడుతూ వార్తల్లో వ్యక్తిగా ఉండే కేఏ పాల్.. ఇప్పుడు ఒక కేసులో ఇరుక్కున్నారు. ఆయన మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ యువతి ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నారు. ఆమె మీద పాల్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. తనను పాల్ లైంగికంగా వేధించినట్టు ఆ యువతి పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. యువతి చేసిన ఫిర్యాదును పరిగణనకు తీసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక ఈ కేసు కు సంబంధించి పోలీసుల దర్యాప్తు మొదలుపెట్టారు. ఫిర్యాదు చేసే క్రమంలోనే ఆ యువతి అనేక ఆధారాలను పోలీసులకు ఇచ్చిన తెలుస్తోంది. మొత్తంగా నిన్నటి వరకు ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ.. విదేశాలకు వెళుతూ.. బిజీ బిజీగా గడిపిన కేఏ పాల్.. ఇప్పుడు ఒక్కసారిగా పోలీసుల చేతిలో కేసు ఎదుర్కోవాల్సి రావడం నిజంగా ఆశ్చర్యకరం.