Revanth Govt Big Sketch: తెలంగాణ రాజధాని, విశ్వనగరం హైదరాబాద్‌లో రోజు రోజుకూ ట్రాఫిక్ రద్ద పెరుగుతోంది. ఇక వర్షాకాలంలో సమస్య మరితం తీవ్రంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో కొత్త కంపెనీలు రావడానికి కాస్త ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు, రైల్ కనెక్టివిటీ పెంచడంతోపాటు, ఎయిర్ కనెక్టివిటీ కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఐటీ కారిడార్లలో ఆధునిక రవాణా పరిష్కారాల వైపు అడుగేస్తోంది. ప్రత్యేకంగా, లాస్ట్ మైల్ కనెక్టివిటీని సులభతరం చేసేందుకు స్కైవాక్‌లు, మోనోరైలు సమన్వయ ప్రణాళిక సిద్ధమవుతోంది.
మెరుగైన రవాణా సౌకర్యం..
సైబరాబాద్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలు ప్రస్తుతం ఉద్యోగులు, పర్యాటకులు ఎక్కువగా సందర్శించే కేంద్రాలుగా ఉన్నాయి. మెట్రో లేదా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ స్టేషన్‌ల నుంచి ఆఫీసు సముదాయాల వరకు సులభ చలనం అందించేందుకు స్కైవాక్‌లను ప్రతిపాదిస్తున్నారు. ఇవి పాదచారులకు మాత్రమే కాకుండా సైక్లింగ్ మార్గాలుగా కూడా ఉపయోగపడేలా రూపకల్పన చేయనున్నారు.
రైలు కనెక్టివిటీ..
ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మోనో రైలు ప్రాజెక్టు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో అమలు కానుంది. ఈ రైలు ఐటీ కారిడార్లతో పాటు సమీప నివాస సముదాయాలను అనుసంధానం చేస్తుంది. దీంతో భారీ రాకపోకల ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. మోనో రైలు నెట్‌వర్క్ ద్వారా మెట్రోకు అనుసంధానం సులభమవుతుంది.
అనుమతులు కీలకం..
స్కైవాక్‌లు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ యత్నాలకు ప్రధాన సవాలు భవన యాజమాన్యాల అనుమతులు, ప్రైవేట్ కమర్షియల్ బిల్డింగ్ ఓనర్లు అనుకూలిస్తే నిర్మాణం వేగంగా సాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) ఫండ్స్ ద్వారా అమలు చేసే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ప్రణాళికలను త్వరలో ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం ఆధునిక పట్టణ మౌలిక సదుపాయాల దిశగా దూసుకుపోవాలనే లక్ష్యంతో, ఈ ప్రాజెక్టులను ప్రాధాన్యంగా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది.
స్కైవాక్‌లు, మోనోరైలు ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో అమలైతే హైదరాబాద్ అంతర్జాతీయ ప్రమాణాల నగర రవాణా మోడల్ వైపు అడుగేస్తుంది. ఉద్యోగులకు సమయ, భద్రత, సౌలభ్యం కలిపిన ఆధునిక ప్రయాణ పద్ధతులు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రణాళిక ఐటీ హబ్‌లను సదుపాయాలతో మాత్రమే కాక, సమర్థమైన రవాణా అందుబాటులోకి వస్తుంది.