Hyderabad Real estate : హైదరాబాద్‌కు ప్రపంచ వ్యాప్తంగా బ్రాండ్ ఇమేజీ ఉందన్న విషయం తెలిసిందే. అదే బ్రాండ్ మరోసారి రుజువైంది. దేశంలో ఎక్కడా లేని విధంగా.. ఎవరూ ఊహించనంతగా హైదరాబాద్ మరో ఖ్యాతి సాధించింది. ఎవరూ ఊహించని విధంగా హైదరాబాద్‌లో రియల్ బూమ్ ఇక్కడే ఉందని వివిధ సర్వేలు వెల్లడించాయి. మరోవైపు.. ఇక్కడ జరుగుతున్న రిజిస్ట్రేషన్లను చూస్తే కూడా అదే అర్థం అవుతోంది. తాజాగా.. నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్ట్‌లోనూ అదే వెల్లడైంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నదో చూడచ్చు. బయట జరుగుతున్న ప్రచారానికి, జరుగుతున్న రిజిస్ట్రేషన్లకు లింకు లేకుండా ఉంది. అంతలా టాప్ ట్రెండింగ్‌లో రియల్ బూమ్ ఉంది.
హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్లు పడిపోతున్నాయి.. రియల్ బూమ్ పూర్తిగా ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టివేయబడిందని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. అయితే.. వాటన్నిటికీ ఈ సర్వేలే సమాధానాలు చెప్పాయి. హైదరాబాద్ బ్రాండ్ తగ్గించాలని చూసినా.. తగ్గుతోందని ప్రచారం చేసినా అది ఏ మాత్రం సాధ్యపడలేదు. రియల్ ఎస్టేట్ రంగం దేశవ్యాప్తంగా కాస్త డౌన్ ట్రేండ్ కనిపిస్తోంది. కానీ.. భాగ్యనగరంలో మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా రియల్ బూమ్ పెరుగుతూనే ఉంది. తాజాగా.. నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రైమ్ సిటీ ఇండెక్స్ రిపోర్టు ప్రకారం దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో హైదరాబాద్ నంబర్ స్థానంలో నిలిచింది. దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ టాప్ ప్లేసులో నిలిచింది. రెండో స్థానంలో బెంగళూరులో నిలిచింది. ఆ తరువాత ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై నగరాలు ఉన్నాయి. మౌలిక సదుపాయాల కల్పన, స్థిరాస్తి రంగం విస్తరణ, ప్రభుత్వ విధానాల పరిపాలన, జనాభా పెరుగుదల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ సర్వే విశ్లేషించింది. హైదరాబాద్ సిటీలో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ఏటా పది శాతం వృద్ధి కనబరుస్తూ వస్తున్నదని రిపోర్ట్‌లో పేర్కొంది.
2023లో హైదరాబాద్ రెసిడెన్షియల్ రంగంలో రియల్ ఎస్టేట్ 11 శాతం వృద్ధి సాధించింది. పెట్టుబడిదారులు, వినియోగదారులు హైదరాబాద్‌లో స్థిరాస్తులు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారని వెల్లడించింది. బ్రాడ్ రోడ్లు, అండర్ పాస్‌లు, రింగ్ రోడ్లు, మెట్రో విస్తరణ కారణంగా రవాణా సదుపాయాలు నగరానికి నలువైపులా ఉన్నాయి. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇవి కాస్త నగర విస్తరణకు, స్థిరాస్తి రంగ వృద్ధికి యూజ్ అయినట్లుగా తెలుస్తోంది. మరోవైపు.. నగరంలో మెట్రో ద్వారా గంటలోనే గమ్యస్థానానికి చేరుకునే వెసులుబాటు కలిగింది. దీంతో నగరం విస్తరించేందుకు కారణంగా నిలిచింది. ఐటీతోపాటు ఫార్మాసుటికల్స్, బయో టెక్నాలజీ రంగాలు కూడా విస్తరిస్తుండడం మరింత అడ్వాంటేజీగా మారాయి. వీటి కారణంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగి స్థిరాస్తి రంగానికి డిమాండ్ ఏర్పడింది.
సంస్థలు ఇచ్చే రిపోర్టుతో పాటే జనవరి నుంచి ఆగస్టు మధ్య జరిగిన రిజిస్ట్రేషన్ల సంఖ్య చూసినా ఇదే అర్థం అవుతోంది. ఆగస్టులో హైదరాబాద్ సిటీలో 6,439 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి విలువ రూ.4,043 కోట్లు. గతేడాదితో పోలిస్తే 17 శాతం విలువ పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 8 నెలల్లో 54,483 ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడాదితో పోలిస్తే 18 శాతం పెరిగాయి. ఈ లెక్కల ప్రకారం చూసినా హైదరాబాద్ నగరంలో రియల్ వ్యాపారం జోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌తోపాటే రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి ఏరియాల్లో రియల్ వ్యాపారం జోరు ఏమాత్రం తగ్గలేదు.