ఎల్‌ఆర్‌‌ఎస్‌ భారం ఎంత తగ్గింది?

లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్ (ఎల్‌ఆర్‌‌ఎస్‌) పై ఒక్కసారిగా బాంబ్ పేల్చిన తెలంగాణ రాష్ట్ర సర్కార్‌‌.. ప్రజల నుంచి ఎదురైన నిరసనలతో కొంత వెనక్కి తగ్గింది. తాజాగా.. క్రమబద్ధీకరణ చార్జీలను తగ్గిస్తూ నిర్ణయించింది. అసెంబ్లీ వేదికగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌‌ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం సవరణ ఉత్తర్వు (జీవో 135)ను జారీ చేసింది. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 131లో నాలుగు శ్లాబులు ఉండేవి. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేక […]

Written By: NARESH, Updated On : September 18, 2020 11:12 am

lrs telangana

Follow us on

లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్ (ఎల్‌ఆర్‌‌ఎస్‌) పై ఒక్కసారిగా బాంబ్ పేల్చిన తెలంగాణ రాష్ట్ర సర్కార్‌‌.. ప్రజల నుంచి ఎదురైన నిరసనలతో కొంత వెనక్కి తగ్గింది. తాజాగా.. క్రమబద్ధీకరణ చార్జీలను తగ్గిస్తూ నిర్ణయించింది. అసెంబ్లీ వేదికగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌‌ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం సవరణ ఉత్తర్వు (జీవో 135)ను జారీ చేసింది.

ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 131లో నాలుగు శ్లాబులు ఉండేవి. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేక వచ్చింది. దీంతో కేటీఆర్‌‌ బుధవారం శాసనసభలో కీలక ప్రకటన చేశారు. ‘2015లో ఎల్‌ఆర్‌ఎస్‌కు జారీ చేసిన జీవో 151ను యథాతథంగా తెస్తాం. ఒకవేళ ప్లాట్లను 2010లో కొని ఉంటే.. అప్పటి రిజిస్ట్రేషన్‌ విలువ ఆధారంగా 14% చార్జీ చెల్లిస్తే చాలు. కొత్త సవరణతో చార్జీలు 50.60 శాతం తగ్గనున్నాయని’ చెప్పారు.

గడువు పొడిగించాలన్న సభ్యుల సూచనపై.. 6 నెలల సమయం ఉంటుందన్నారు. కేటీఆర్‌ ప్రకటన మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గురువారం సవరణ ఉత్తర్వులు విడుదల చేశారు. 2015 నాటి ఉత్తర్వులో ఆ ఏడాది అక్టోబరు 28 నాటి మార్కెట్‌ విలువ ప్రకారం చార్జీలకు 7 శ్లాబులుగా ఉన్నాయి. తాజా ఉత్తర్వుల్లో ఈ ఏడాది ఆగస్టు 26 నాటి మార్కెట్‌ విలువను పరిగణనలోకి తీసుకుని 7 శ్లాబులను ప్రకటించారు. ఖాళీ స్థలం(ఓపెన్‌ స్పేస్‌) 10% కూడా లేని ప్లాట్లకు 14% చార్జీ విధించడంలో రిజిస్ట్రేషన్‌ నాటి విలువను పరిగణనలోకి తీసుకునేలా వెసులుబాటు ఇచ్చారు.

తాజా ఉత్తర్వుల ప్రకారం.. చదరపు గజం మార్కెట్‌ విలువ రూ.3 వేల వరకు ఉన్న వారికి 5 శాతం, రూ. 3–5 వేల వరకు ఉన్న వారికి 20 శాతం, రూ.5–10 వేలు ఉన్న వారికి 35 శాతం, రూ.10–2‌0 వేల వరకు ఉన్న వారికి 50 శాతం, రూ.20–30 వేలు ఉన్నవారికి 40 శాతం, రూ.30–50 వేలు ఉన్న వారికి 20 శాతం ప్రాథమిక క్రమబద్ధీకరణ చార్జీల్లో ఉపశమనం లభించింది. గత జీవో ప్రకారం మార్కెట్‌ విలువ చదరపు గజానికి రూ.10 వేలు దాటితే 100 శాతం క్రమబద్ధీకరణ చార్జీలు చెల్లించాలని పేర్కొన్నారు. తాజా జీవో ప్రకారం గజానికి రూ.50 వేలు దాటిన వారే 100 శాతం చెల్లించాల్సి ఉంది.

నాలా చార్జీలు ఎల్‌ఆర్‌ఎస్‌లో భాగమేనంటూ ఉపశమనం కలిగించా రు. ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీలు చెల్లిస్తే ప్రత్యేకించి నాలా చార్జీలు వేయరు. అనధికారిక లే-అవుట్లలో నిబంధనల ప్రకారం ఓపెన్‌ స్పేస్‌ వదలాల్సి ఉంటుంది. కాగా.. క్రమబద్ధీకరణ శ్లాబులను రిజిస్ట్రేషన్‌ నాటి మార్కెట్‌ విలువను పరిగణనలోకి తీసుకుని ఉంటే దరఖాస్తుదారులకు భారీ ఉపశమనం కలిగేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.