Homeఆధ్యాత్మికంBonala festival : బోనం అంటే ఏమిటి.. బోనాల పండుగ చరిత్ర.. విశిష్టత తెలుసుకుందామా..

Bonala festival : బోనం అంటే ఏమిటి.. బోనాల పండుగ చరిత్ర.. విశిష్టత తెలుసుకుందామా..

Bonala festival : ఆషాఢమాసం వచ్చిందంటే తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంటుంది. జూలై/ఆగస్టు నెలల్లో వచ్చే ఆషాఢ మాసంలో తెలంగాణలో జరుపుకునే అతిపెద్ద పండుగ బోనాలు.. పండుగ మొదటి, చివరి రోజులలో ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక తెలంగాణ బోనాల పండుగ ఇప్పటికే షురూ అయింది. బోనాలు అనగానే అందరికీ గుర్తొచ్చేది హైదరాబాదే. భాగ్యనగరంలో బోనాల సందడి షురూ అయ్యింది. ఈ పండుగతో హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంట నగరాలు నెలరోజులపాటు కోలాహలంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో బోనాల జాతర విశిష్టత తెలుసుకుందాం.

గోల్కొండ బోనాలతో షురూ..
భాగ్యనగరంలో బోనాల పండుగ ఏటా గోల్కొండ బోనాలతో సందడి షురూ అవుతుంది. ఒకప్పుడు బోనాల పండుగను గ్రామాల్లో మాత్రమే ఘనంగా జరుపుకునేవారు. అందుకే ఈ బోనాల పండుగను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి. ఏటా సర్కారు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తూ వస్తోంది. జగదాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలతో జాతర మొదలైంది.

గ్రామ దేవతలకు మొక్కులు..
తెలంగాణ సంప్రదాయానికి చిహ్నమైన బోనాన్ని మహిళలే తయారు చేస్తారు. బోనాల జాతరను ఆషాఢ మాసం తొలి ఆదివారంతో ప్రారంభం అవుతుంది. జాతర సందర్భంగా గ్రామ దేవతలైన ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ, మహాలక్ష్మమ్మ, మహంకాళమ్మలను కొలుస్తారు. పసుపు కుంకుమలు, చీరసారెలు సమర్పిస్తారు. బోనం నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లిస్తారు. ఇంటిల్లిపాదీ అందరినీ కాపాడాలని, తమకు ఏ ఆపద రాకుండా చూడాలని కోరుకుంటారు. ఇక బోనాల జాతరను తెలంగాణతోపాటు ఆంధ్రా, రాయలసీమ, కర్ణాకలోని కొన్ని ప్రాంతాల్లోనూ జరుపుకుంటారు.

మట్టి కుండలో బోనం..
బోనాల జాతర సందర్భంగా అమ్మవారికి సమర్పించే బోనాన్ని మట్టి కుండలో తయారు చేస్తారు. సంపన్నులు రాగి కుండలో తయారు చేస్తారు. అనంతరం బోనం కుండలకు వేపాకులు, పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. కుండపైన గండ దీపాన్ని కూడా పెడతారు. వీటిని మహిళలు నెత్తిన పెట్టుకుని.. మేళ తాళాలు, డప్పు చప్పుళ్ల మధ్య ఆలయాలకు తీసుకెళ్లి.. బోనం కుండలను నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు.

చరిత్ర ఇదీ..
ఇక బోనాల పండుగకు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. కాకతీయ రాజులలో ఒకరైన ప్రతాప రుద్రుడు గోల్కోండలోని శ్రీజగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు పెద్దలు చెబుతారు. తర్వాత నిజాం నవాబులు సైతం ఇక్కడ పూజలు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చారు. హైదరాబాదులోని జగదాంబిక అమ్మవారి ఆలయం అతి పురాతనమైంది. అందుకే ఇక్కడే తొలి బోనాన్ని ప్రారంభిస్తారు. ఇక రెండో బోనాన్ని బల్కంపేట రేణుక ఎల్లమ్మ కు సమర్పిస్తారు. మూడో బోనం సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఎత్తుతారు.

ఉజ్జయిని మహంకాళి విశిష్టత..
సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఓ చరిత్ర ఉంది. దేశం బ్రిటిష్‌ పాలనలో ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన సురటి అప్పయ్య అనే వ్యక్తి బ్రిటిష్‌ ప్రభుత్వంలో ఉద్యోగిగా పనిచేసేవాడు. 1813వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం అతడిని మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి బదిలీ చేసింది. ఆ సమయంలో భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి సోకి కొన్ని వేల మంది చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న సురటి అప్పయ్య సహోద్యోగులతో కలిసి ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వెళ్లి తెలంగాణ ప్రాంత ప్రజలను కాపాడాలని కోరుకున్నాడట. వ్యాధి తగ్గితే.. తెలంగాణ ప్రాంతంలో ఉజ్జయిని అమ్మవారికి ఆలయం కట్టిస్తానని మొక్కుకున్నారు. ఆ క్షణం నుంచి ఆ వ్యాధి తగ్గిపోయిందట. వ్యాధి పూర్తిగా తగ్గిపోయిన తర్వాత 1815లో హైదరాబాద్‌ నగరానికి తిరిగొచ్చి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించాడట. తర్వాత ఆలయ నిర్మాణాన్ని దగ్గరుండి పూర్తి చేయించాడు నాటి నుంచి ఏటా ఆషాఢ మాసంలో బోనాల పండుగ ఘనంగా జరుగుతోంది.

రంగంతో ముగింపు..
ఇక నెల రోజులు సందడిగా సాగే బోనాల జాతర.. చివరి రోజు రగంతో ముగుస్తుంది. బ్రహ్మచారిణి అయిన మహిళ మట్టికుండ మీద నిలబడి భవిష్యవాణి చెబుతుంది. దీన్నే రంగం అంటారు. ఆషాఢమాసం చివరి ఆదివారం ఉజ్జయిని బోనాలు నిర్వహిస్తారు. తర్వాతి రోజు రంగం నిర్వహిస్తారు. తర్వాత అమ్మవారి విగ్రహాన్ని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకెళ్లి మూసీ నదిలో నిమజ్జనం చేస్తారు. దీంతో బోనాల సంబురాలు ముగుస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular