Vinayaka Immersion 2024: వినాయక నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఊరూరా వాడ వాడలా గణనాథుడు కొలువుదీరి భక్తుల పూజలందుకుంటున్నాడు. రోజుకో అలంకరణలో భక్తులు స్వామివారిని కొలుస్తున్నారు. తీరొక్క నైవేద్యం సమర్పిస్తున్నారు. కొందరు నిమజ్జనం కూడా ప్రారంభించారు. మూడు రోజులు, ఐదు రోజులు, ఏడు రోజులు, తొమ్మిది రోజులు, 11 రోజులు ఇలా నిమజ్జనం చేస్తుంటారు. ఇదిలా ఉంటే వినాయక చవితి వస్తుందంటే చాలు ఏటా వార్తల్లో ఉండే అంశం హైదరాబాద్‌లో నిమజ్జనం ఎక్కడ అని? విశ్వనగరంలో నిమజ్జనం అంటే గుర్తుకు వచ్చేది హుస్సేన్ సాగర్– ట్యాంక్ బండ్. కానీ, రసాయనాలతో చేసిన గణనాథులను సాగర్‌లో నిమజ్జనం చేయటంపై గతంలోనే ఎన్నో పిటిషన్లు దాఖలు కాగా హైకోర్టు కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసింది. హైకోర్టు నిర్ణయం ప్రకారం కేవలం మట్టి గణపయ్యలనే సాగర్‌లో నిమజ్జానానికి అనుమతి ఇవ్వాలి. రసాయనాలు, పాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వాటిని అనుమతించవద్దు అని. కానీ, ప్రభుత్వం గతంలో కొన్ని మినహాయింపులు తెచ్చుకొని నిమజ్జనాన్ని పూర్తి చేసింది.
మళ్లీ కోర్టులో పిటిషన్..
ఈ ఏడాది మరోసారి ఈ అంశం కోర్టుకు ముందుకు వచ్చింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని సాగర్‌ను కాపాడాలని పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే విచారణ కూడా జరిగింది. ఈసారి హైడ్రాను కూడా ప్రతివాదుల లిస్ట్‌లో చేర్చాలని పిటిషనర్ వాదించారు. ఇప్పటికే నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యంలోం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఓకే. కానీ, నో చెప్తే ఏం చేయాలన్నది కీలకం కాబోతుంది. ఈ ఏడాదికి కూడా తాత్కాలిక అనుమతి కోరుతారా? ప్రభుత్వం మారిన అధికారులంతా ఒక్కరే కాబట్టి కోర్టు నో చెప్తుందా? అన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. మంగళవారం దీనిపై హైకోర్టు కీలక తీర్పు రాబోతుంది.
మురికి కూపంగా హుస్సేన్ సాగర్..
ఇదిలా ఉంటే.. ఏడాదంతా హుస్పేన్ సాగర్ మురికి కూపాన్ని తలపిస్తోంది. నగరంలోని డ్రెయినేజీ నీరంతా సాగర్‌లోనే కలుస్తుంది. అయినా ఈ విషయం పర్యావరణ వేత్తలకు పట్టదు. కేవలం వినాయక చవితి రాగానే.. రసాయన విగ్రహాలు… కలుషితం.. కాలుష్యం అన్న అంశాలు గుర్తొస్తాయి. వెంటనే కోర్టును ఆశ్రయిస్తారు. నిమజ్జనాన్ని అడ్డుకుంటారు. వాస్తవానికి నిమజ్జనం జరిగిన మరుసటి రోజు నుంచే జీహెచ్‌ఎంసీ అధికారులు సాగర్‌లోని విగ్రహాలను తొలగిస్తుంటారు. వారం పది రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుంది. కానీ, పర్యావరణ వేత్తలు దీనినిగానీ, ఏడాదంతా కలుస్తున్న డ్రెయినేజీ నీటిని గాని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
బారికేడ్లు పెట్టిన పోలీసులు..
ఇదిలా ఉంటే.. గతేడాది ఇచ్చిన తీర్పు మేరకు ఈ ఏడాది వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయడానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈమేరకు సాగర్ చుట్టూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎవరూ విగ్రహాలతో సాగర్‌వైపు రాకుండా బారికేడ్లు పెట్టారు. దీంతో వినాయక మండపాల నిర్వాహకులు, గణేశ్ ఉత్సవ సమితి నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.