Rain Alert: వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు దాటింది. రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి కూడా నెల రోజులైంది. కానీ, ఇప్పటికీ రాష్ట్రంలో హైదరాబాద్ మినహా ఎక్కడా చెప్పుకోదగిన వర్షాలు కురవలేదు. దీంతో వ్యవసాయ పనులు ముందుకు సాగడం లేదు. అడపాదడప కురుస్తున్న జల్లులు పత్తి చేలకు జీవం పోస్తున్నాయి. వరికి సరిపడా వానలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఐదు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ముసురుకున్న వానలు..
వాతావరణ శాఖ అంచనాల ప్రకారమే తెలంగాణలో వాన ముసురుకుంది. రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం పడింది. రహదారులు చెరువులను తలపించాయి. వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు నగరంలో సగటున 8.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని నగర వాసులకు సూచించారు. సోమవారం కూడా హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో హుస్సేన్ సాగర్ నిండుకుండను తలపిస్తోంది. హుస్సేన్ సాగర్ గరిష్ఠ స్థాయి నీటి సామర్థ్యం 514.75 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 513.210 మీటర్ల మేర ఉందని అధికారులు తెలిపారు. దీంతో అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.
ఐదు జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
ఇక సోమవారం నుంచి రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా అదిలాబాద్, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, పెద్దపల్లి, నిర్మల్, రాజన్నసిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల సోమవారం మోస్తరు వర్షాలు కురిశాయి.
ఐదు రోజులు వర్షాలు..
తెలంగాణలో రాబోయే ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వ్యవసాయ పనులకు వెళ్లేవారు వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఉండకూడదని వాతావరణ శాఖ తెలిపింది.
ఉపరితల ఆవర్తనం..
ఇదిలా ఉండగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కోస్తాంధ్ర ప్రదేశ్‌లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన ఆవర్తనం పశ్చిమ బెంగాల్ మీదుగా ఏర్పడిన ఆవర్తనంలో కలిసిపోయిందని వాతావరణశాఖ తెలిపింది. దీంతో జూలై 18 వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
– సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది.
– మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమురంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆరెంజ్ అలర్ట్..
ఇదిలా ఉండగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.