Gap between Revanth and Ministers: తెలంగాణ రాష్ట్రంలో ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితి నెలకొంది. వాస్తవానికి అధికారపక్షం వర్సెస్ ప్రతిపక్షం అన్నట్టుగా రాజకీయాలు సాగుతాయి. కానీ, తెలంగాణ రాష్ట్రంలో స్వపక్షంలోనే విపక్షం ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనికి తోడు నేతలు ఎవరికి వారుగా మీడియాకు లీకులు ఇస్తున్న నేపథ్యంలో.. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలపాటు అధికారంలో భారత రాష్ట్ర సమితి ఉంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. సహజంగానే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉంటుంది. అందువల్ల నేతలు ఎవరికి వారు అన్నట్టుగా మాట్లాడుతుంటారు.
హై కమాండ్ కూడా ఈ తరహా నేతల విషయంలో చూసీచూడనట్టు వ్యవహరిస్తూ ఉంటుంది. చర్యలు తీసుకునే విషయంలో కాస్త వెనకా ముందు ఆలోచిస్తూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ అలా చేయడం వల్లే పరిస్థితి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది.
రేవంత్ రెడ్డి మధ్య, మిగతా మంత్రుల మధ్య గ్యాప్ ఉందని ప్రచారం జరుగుతుంది. అంతకుముందు కొండ సురేఖ, ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క.. వంటి మంత్రులతో రేవంత్ రెడ్డికి గ్యాప్ వచ్చిందని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా గులాబీ పార్టీ మీడియా, సోషల్ మీడియా ఈ వ్యవహారాలను విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇవి ఎంతవరకు వెళ్లాయంటే.. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా భట్టి పావులు కదుపుతున్నారనే ప్రచారం దాకా చేరుకున్నాయి. అయితే వీటిని ఖండించాల్సిన నేతలు వినోదం చూస్తుండడంతో.. ఇదంతా నిజమేనని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు.
వాస్తవానికి ఇటీవల నైనీ కోల్ వ్యవహారం తెరపైకి వచ్చిన తర్వాత అందరి దృష్టి భట్టివిక్రమార్క మీద కేంద్రీకృతమైంది. దీనికి ప్రధాన కారణం ఆంధ్రజ్యోతి పత్రిక అధిపతి వేమూరి రాధాకృష్ణ రాసిన కొత్త పలుకు. రాధాకృష్ణ ఆ స్థాయిలో రాయడం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు భట్టి విక్రమార్కతో కలిసి ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి వ్యాపార సాగిస్తున్నారని ఆరోపణలు కూడా వినిపించాయి. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి వల్ల జరుగుతున్నాయని గులాబీ పార్టీ మీడియా ఆరోపించడం మొదలుపెట్టింది. దీంతో తెరపైకి భట్టి రావాల్సి వచ్చింది. కాకపోతే ఆయన స్వీట్ వార్నింగ్ స్థాయిలో మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు. వాస్తవానికి ప్రత్యర్ధులు చేస్తున్న విమర్శలు.. మీడియా రాస్తున్న కథనాలు ఘాటుగా ఉంటే.. వాటికి కాంగ్రెస్ నేతలు ఇస్తున్న బదులు మామూలుగా ఉంటున్నది. అందువల్లే జనాలలో, సమాజంలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే వీటిని ఖండించాల్సిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు మౌనాన్ని ఆశ్రయించడం అనేక అనుమానాలకు కారణమవుతోంది.
ఇటీవల భట్టి మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రికి తనకు మధ్య సానుకూల వాతావరణం ఉంది అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి కూడా వివిధ వేదికలలో మంత్రులకు అనుకూలంగా మాట్లాడారు. తమ ప్రభుత్వంపై ఏవైనా వ్యతిరేక కథనాలు రాయాలి అనుకుంటే తన వివరణ తీసుకోవాలని ముఖ్యమంత్రి ఇటీవల వ్యాఖ్యానించడం కొసమెరుపు. ఏది ఏమైనప్పటికీ మంత్రులతో రేవంత్ రెడ్డికి గ్యాప్ ఉందని గులాబీ పార్టీ మీడియా, గులాబీ నాయకులు అంటుంటే.. అదంతా ఉట్టి ప్రచారమని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టి పారేస్తున్నారు. కానీ ఈ గ్యాప్ లో మిగతా వారికి కావాల్సిన వినోదం.. అంతకుమించి అనే స్థాయిలో మసాలా లభిస్తోంది.