Half Day Schools: తెలంగాణలో ఈసారి ఎండల తీవ్రత ఫిబ్రవరిలోనే ప్రారంభమైంది. మార్చి 2 నుంచి భానుడు భగ్గుమంటున్నాడు. ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ఈ తరుణంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, విద్యార్థుల ఆరోగ్యాన్ని(Students Health) దృష్టిలో ఉంచుకుని ఒంటిపూట బడుల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మార్చి 15, 2025 నుంచి ఏప్రిల్ 23, 2025 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అయితే, పెరుగుతున్న ఎండల తీవ్రత(Sun effect) కారణంగా మార్చి 10 నుంచే అమలు చేయాలనే ప్రతిపాదనపై కసరత్తు జరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. ఈ సమయంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించి, ఆ తర్వాత ఇంటికి పంపుతారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. పదో తరగతి పరీక్షలు జరిగే సెంటర్లలో పరీక్షలు పూర్తయ్యే వరకు మధ్యాహ్న సమయంలో కూడా స్కూళ్లు కొనసాగుతాయి.
Also Read: డియర్ మిల్లర్.. కివీస్ గెలిచినా.. చివరి 25 బంతుల్లో నీ ఆటకు హాట్సాఫ్ అంతే..
ముందస్తు అమలు ప్రతిపాదన
ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ముందుగానే ఒంటిపూట బడులు ప్రారంభించాలని వినతులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 10 నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేసే అవకాశాలపై విద్యాశాఖ అధికారులు(Education department) చర్చిస్తున్నారు. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. రంజాన్ పండుగ సందర్భంగా ఉర్దూ మీడియం విద్యార్థులకు ఇప్పటికే మార్చి 3 నుంచి ఏప్రిల్ 1 వరకు ఒంటిపూట బడులు (ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు) ప్రారంభమయ్యాయి. ఎండల తీవ్రతను గమనించిన విద్యాశాఖ, ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.(Report to Government) గత సంవత్సరాల్లో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమైనప్పటికీ, ఈసారి వాతావరణ హెచ్చరికల దృష్ట్యా ముందుగానే అమలు చేయాలని ప్రతిపాదించింది.
ఆంధ్రప్రదేశ్‌లోనూ..
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో కూడా మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. తెలంగాణలోనూ ఇదే తేదీని ప్రాథమికంగా ఖరారు చేసినప్పటికీ, వాతావరణ శాఖ హెచ్చరికలు మరియు ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడితో మార్చి 10 నుంచే అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వాతావరణ హెచ్చరికలు
తెలంగాణ(Telangana) వాతావరణ శాఖ ఈ సంవత్సరం ఎండలు అధికంగా ఉంటాయని హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల నుంచి 38 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని, ఇది విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యలు రాకుండా చూడటానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది.
వేసవి సెలవులు
ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి పని దినం ఏప్రిల్ 23 కాగా, ఆ తర్వాత ఏప్రిల్ నెలాఖరు నుంచి వేసవి సెలవులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సెలవులు కూడా ముందుగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.