Tonic Liquor: అది ఓ మద్యం దుకాణం సిండికేట్. అందరిలాగానే దరఖాస్తులు చేసుకుంటే.. లక్కీ డ్రా లో వారికి షాపులు తగిలాయి. అందరి లాగానే ఆ షాప్ నిర్వాహకులు కూడా మద్యం విక్రయిస్తున్నారు. అయితే ఇందులో ఏముంది గొప్పతనం అంటారా? అక్కడికే వస్తున్నాం ఆగండి. గొప్పతనం కాదు.. అడ్డగోలుగా దోచిన తనం. స్థూలంగా చెప్పాలంటే జిఎస్టి ఎగ్గొట్టి దర్జాగా కోట్లు వెనకేసిన తనం.. తెర వెనుక గత ప్రభుత్వ పెద్దలు ఉండటంతో ఆ షాపు నిర్వాహకులు రెండో మాటకు తావు లేకుండా దండుకున్నారు. ప్రభుత్వం మారడంతో ఒక్కసారిగా వారి లీలలు బయటపడుతున్నాయి. అంతేకాదు జీఎస్టీ అధికారుల తనిఖీలు చేస్తుంటే విస్తు గొలుపే వాస్తవాలు కళ్ళకు కడుతున్నాయి. ఈ లిక్కర్ సిండికేట్ లో గత ప్రభుత్వ హయాంలో సీఎంఓ అధికారిగా పనిచేసిన వ్యక్తి కూతురు, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి కూతురు, మరో అధికారి కూతురికి వాటాలు ఉండడం విశేషం.
హైదరాబాద్ మహానగరంలోని టానిక్ లిక్కర్ గ్రూప్స్ కు చెందిన వైన్ షాపులపై జిఎస్టి అధికారులు మూడురోజులుగా తనిఖీలు చేస్తున్నారు. గత ప్రభుత్వ ప్రజల సహకారం ఉండటంతో ఈ షాపు నిర్వాహకులకు ఏ4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేసింది. వాస్తవానికి రాష్ట్రంలో ఎక్కడా లేని ఎలైట్ అనుమతులు కేవలం టానిక్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించే మద్యం షాపులకే ఇవ్వడం విశేషం. ఇది నిబంధనలకు విరుద్ధమని ఎక్సైజ్ అధికారులు చెప్పినప్పటికీ.. గత ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తీసుకురావడంతో ఎలైట్ లైసెన్స్ ఇచ్చారు. పాలసీలో ముందుగా ఇటువంటి అనుమతిపై కనీసం నోటిఫై కూడా చేయలేదని తెలుస్తోంది.
హైదరాబాద్ నగరంలో టానిక్ లిక్కర్ గ్రూప్ కింద 11 ఫ్రాంచైజీలు ఉన్నాయి. క్యూ బై టానిక్ పేరుతో ఆ సంస్థ మద్యం విక్రయాలు జరుపుతోంది. విక్రయాలు బాగున్నప్పటికీ చెల్లించే పన్ను విషయంలో తేడా రావడం జీఎస్టీ అధికారులు మూడు రోజుల నుంచి టానిక్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మద్యం షాపులపై సోదాలు నిర్వహించడం మొదలుపెట్టారు. అధికారుల సోదాల్లో టానిక్ గ్రూప్ మద్యం షాపులకు గత ప్రభుత్వం ఇచ్చిన వెసలు బాట్లు చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అంతేకాదు 11 మద్యం షాపులను అనిత్ రెడ్డి, అఖిల్ రెడ్డి అనే వ్యక్తులు నడిపిస్తుండడం విశేషం. ఇక ఈ గ్రూప్ పరిధిలో బోడుప్పల్, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న షాపుల్లో ముగ్గురు రాష్ట్ర ఉన్నతాధికారుల కుటుంబ సభ్యులకు వాటాలు ఉన్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో సీఎంవో అధికారిగా పనిచేసిన భూపాల్ రెడ్డి కుమారుడు భూపాల్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి, ఎక్సైజ్ ఉన్నతాధికారి కూతురు, మరో అడిషనల్ ఎస్పీ కూతురు ప్రియాంక రెడ్డి కి టానిక్ గ్రూప్ లో వాటాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే జిఎస్టి అధికారులు మూడోరోజు కూడా సోదాలు నిర్వహించడంతో భారీగా అవకతవకలు వెలుగు చూసాయని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారులు నోరు మెదపడం లేదు.