Gram Panchayat Election: సర్పంచ్ పదవి.. మహా అయితే ఐదు సంవత్సరాలు ఉంటుంది. ఈ పదవి కోసం గ్రామాలలో చాలా ఎత్తులు పై ఎత్తులు చోటుచేసుకుంటాయి. సర్పంచ్ పదవిని దక్కించుకోవడానికి చాలామంది పోటీ పడుతుంటారు. డబ్బు, కులం, అనేక సమీకరణాలు ఇందులో కీలకపాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడు విడతలలో ఎన్నికల సంఘం ఈ ఎన్నికలు నిర్వహించనుంది. ఇందులో భాగంగా సర్పంచ్ స్థానం కోసం నేతలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నారు.
గ్రామంలో సర్పంచ్ పదవికి పలుకుబడి చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్లే ఈ పదవి కోసం చాలామంది పోటీ పడుతుంటారు. కొన్ని ప్రాంతాలలో రిజర్వేషన్ వల్ల ఆశావాహుల లెక్కలు మారిపోతుంటాయి. ఆ లెక్కలను సరి చేయడానికి ఆశావాహులు సరికొత్త ఎత్తులు వేస్తుంటారు. అలా సర్పంచ్ స్థానం దక్కించుకోవడం కోసం ఓ వ్యక్తి చేసిన ఎత్తు చివరికి రివర్స్ అయింది.. అతడిని వార్తల్లో వ్యక్తిగా నిలిపింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో సర్పంచి పదవి కోసం ఓ వ్యక్తి హడావిడి చేశాడు. అంతేకాదు ఉన్నట్టుండి పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే అతడు వేసిన ప్లాన్ ఒక్కసారిగా రివర్స్ అయింది. గంగాధర మండలంలో సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో ఈ గ్రామానికి చెందిన యువకుడు నల్గొండకు చెందిన ఓ ఎస్సీ మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె పేరును ఓటర్ జాబితాలో చేర్పించాడు. నామినేషన్ కూడా దాఖలు చేయాలనుకున్నాడు. అయితే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ముందుగానే వెలువడింది. దీంతో ఓటర్ జాబితా గడువు ముగిసిపోయింది. దీంతో ఆమె పేరు చేరకుండానే ఆగిపోయింది. నామినేషన్ దాఖలు చేయడానికి అర్హత లేకపోవడంతో రివర్స్ అయింది. సర్పంచ్ కావాలని ఉద్దేశంతో ఆ వ్యక్తి చేసిన పని ఒక్కసారిగా వృధాగా మారింది.
ఇతడు మాత్రమే కాదు తెలంగాణ వ్యాప్తంగా చాలామంది రాజకీయ ప్రాబల్యం కోసం.. రాజకీయంగా పై చేయి సాధించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి కులాంతర వివాహాలు చేసుకోవడానికి కూడా వెనుకడుగు వేయడం లేదు. కొన్ని సందర్భాలలో వారి ప్రణాళికలు దెబ్బతింటున్నాయి. అటు రాజకీయంగా.. ఇటు సామాజికపరంగా వారు ఇబ్బంది పడుతున్నారు. కులాంతర వివాహం మంచిదైనప్పటికీ.. రాజకీయాల కోసం చేసుకునే వివాహాలు ఎంత మేరకు నిలబడతాయనేది చూడాల్సి ఉంది.