Governor Tamilisai: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తన పదవికి సోమవారం(మార్చి 18న) రాజీనామా చేశారు. పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పదవికి కూడా రాజీనామా సమర్పించారు. ఈమేరకు తన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు పంపించారు. ఈ కీలక పరిణామం తెలంగాణలో ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలని గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ..
తెలంగాణ గవర్నర్‌గా ఇటీవలే తమిళిసై తన నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. 2019, సెప్టెంబర్‌లో తెలంగాణ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2021, ఫిబ్రవరి 21 పుదుచ్చేరి లెప్ట్‌నెంట్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంతో మొదట సఖ్యతగానే ఉన్నారు. రాజ్‌భవన్ వద్ద ఫిర్యాదుల బాక్సు ఏర్పాటు చేయడం, ప్రజాదర్బార్ నిర్వహించడంతో కేసీఆర్ సర్కార్‌తో విభేదాలు మొదలయ్యాయి. తమిళిసైని బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీజేపీ ఏజెంటుగా చూడడం ప్రారంభించింది. కనీసం ప్రొటోకాల్ కూడా పాటించలేదు. గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించింది. పర్యటనల సందర్భంగా ప్రొటోకాల్ పాటించలేదు. దీంతో గవర్నర్ కూడా అదేవిధంగా స్పందించారు. తాను ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. బిల్లులు పెండింగ్‌లో పెట్టడం, నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను తిరస్కరించడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. బడ్జెట్‌కు కూడా చివరి నిమిషం వరకు ఆమోదం తెలుపకుండా కేసీఆర్ సర్కార్‌ను టెన్షన్ పెట్టారు. ఇలా కేసీఆర్ సర్కార్‌తో ఢీ అంటే ఢీ అన్నట్లుగానే వ్యవహరించారు.
తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి..
తమిళిసై సౌందర రాజన్ 20 ఏళ్లకుపైగా రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో తూత్తుకుడి స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2011లో వెలచ్చేరి, 2016లో విరుగంపాక్కం అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేశారు. రెండు రోజుల క్రితం 2024 పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో మరోమారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని గవర్నర్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆమె తన పదవికి రాజీనామా చేశారనితెలుస్తోంది.
మూడు స్థానాలపై దృష్టి..
తమిళిసై ఈసారి సైత్ చెన్నై లేదా తిరునల్వేలి, కన్యాకుమారి లోక్‌సభ స్థానాల్లో ఏదో ఒకచోటు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. డాక్టర్ అయిన తమిళిసై తొలుత వృత్తి కూడా నిర్వహించారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. తమిళిసైకి భర్త సౌందరరాజన్, పిల్లలు సుగానాథన్ సౌందరరాజన్ ఉన్నారు. 1961 జూన్ 2న కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ ప్రాంతంలో జన్మించారు. తమిళిసై తండ్రి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. తమిళిసై తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని 2007లో రాజకీయాల్లో అడుగు పెట్టారు. భారతీయ జనతాపార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు.