HomeతెలంగాణHYDRA: హైడ్రాకు ఫుల్‌ పవర్‌.. ఇక కబ్జాదారులకు దబిడి దిబిడే!

HYDRA: హైడ్రాకు ఫుల్‌ పవర్‌.. ఇక కబ్జాదారులకు దబిడి దిబిడే!

HYDRA: హైడ్రా.. ఈ పేరు వింటేనే హైదరాబాద్‌లోని ఎల్‌టీఎల్, బఫర్‌ జోన్‌లో నిర్మించిన ఇళ్ల యజమానుల గుండెల్లో బుల్డోజర్లు పరిగెత్తుతున్నాయి. ఎప్పుడు హైడ్రా బుల్డోజర్‌ తమ ఇంటిపైకి వస్తుందో అని వణికిపోతున్నారు. రెండు నెలల క్రితం ఏర్పడిన హైడ్రా తన దూకుడుతో ఇప్పటికే వందల ఎకరాలకుపైగా ఆక్రమిత స్థలాన్ని చెర విడిపించింది. ఇందుకోసం వందలాది ఇళ్లు, ఇతర నిర్మాణాలను నేల మట్టం చేసింది. చేస్తోంది. హైడ్రా దూకుడుతో నిత్యం పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం అవుతున్నాయి. మూడు రోజుల క్రితమే హైడ్రా స్పీడ్‌కు హైకోర్టు కాస్త బ్రేకులు వేసింది. అయినా హైడ్రా కూల్చివేతలు మాత్రం పూర్తిగా ఆగలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ౖహె డ్రాకు మరిన్న అధికారాలు కట్టబెట్టింది. హైడ్రాకు చట్టబద్ధత, అధికారాలను కోర్టుతోపాటు పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ తరుణంలో రేవంత్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా హైడ్రాకు మరిన్ని పవర్స్‌ అప్పగిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం తెలుపడంతో చట్టబద్ధత లభించింది.దీంతో ఇక హైడ్రా చేపట్టే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత లభించింది. ఈ చట్టాన్ని శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు ఆర్డినెన్స్‌ హైడ్రాకు రక్షణగా ఉంటుంది. ఇటీవలే రూపొందించిన ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ పలు సందేహాలు వ్యక్తం చేశారు. వాటిని పురపాలక శాఖ కార్యదర్శి దానకిశోర్‌ నివృత్తి చేశారు. దీంతో గవర్నర్‌ ఆర్డినెన్స్‌ను ఆమోదించారు.

మరింత బలోపేతం..
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, క్రీడా మైదానాలను సంరక్షించడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు చేపట్టడం, భారీ వర్షాలు కురిసినప్పుడు ట్రాఫిక్‌ పోలీసులతో సమన్వయం చేసుకుని క్రమబద్ధీకరించడం, ఆగ్నిమాపక సేవలకు సంబందించిన ఎన్‌వోసీ ఇవ్వడం తదితర కార్యలాపాల కోసం ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసింది. ఈమేరకు జూలై 19న జీవో 99 ద్వారా హైడ్రాను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విభాగం, విపత్తుల నిర్వహణ విభాగం ఇప్పటికే తమ పని చేస్తున్నాయి. తాజాగా ఆర్డినెన్స్‌తో మరిన్ని కీలకమైన అధికారాలను హైడ్రాకు కట్టబెట్టింది. హైడ్రాను మరింత బలోపేతం దిశగా పలువురు ఉన్నతాధికారులు, సిబ్బందిని నియమించింది.

కొత్త అధికారాలు ఇవీ..

– హైడ్రా ఆక్రమణలను పరిశీలించడం, నోటీసులు ఇవ్వడం, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణలను తొలగించడం వంటి అధికారాలను జీహెచ్‌ఎంసీ చట్టం – 1955 లోని సెక్షన్‌ 364(బి)ని ఆర్డినెన్స్‌లో చేర్చారు. అనధదికార ప్రకటనలకు జరిమానా విధించే అధికారం కూడా హైడ్రాకు బదిలీ అయింది.

– పురపాలక చట్టం –2019 ప్రకారం సంబంధిత కార్పొరేషన్, ముర్సిపాలిటీ కమిషనర్లకు ఉన్న అధికారాలు, బీపాస్‌ చట్టం–2020 ప్రకారం జోనల్‌ కమిషనర్‌ నేతృత్వంలోని జోనల్‌ టాస్క్‌ ఫోర్స్, కలెక్టర్‌ నేతృత్వంలోని జిల్లా టాస్క్‌ఫోర్స్‌కు ఉన్న అధికారాలు కూడా హైడ్రాకు కేటాయించారు.

హెచ్‌ఎండీఏ చట్టం –2008 లోని పలు సెక్షన్ల కింద కమిషనర్‌కు ఉన్న అధికారం, తెలంగాణ భూ ఆదాయ చట్టంలోని సెక్షన్‌ 1317(ఎఫ్‌) ప్రకారం ఆక్రమణల తొలగింపు, ఆస్తుల పరిరక్షణకు సంబంధించిన ఆర్డీవో, కలెక్టర్‌కు ఉన్న అధికారాలు, ఇవే అంశాలకు సంబంధించి తెలంగాణ నీటిపారుదల చట్టంలోని అధికారాలు, జీవో 67 ద్వారా 2002లో యూడీఏ/ఎగ్జిక్యూటివ్‌ అధికారికి ఇచ్చిన అధికారాలను హైడ్రాకు కట్టబెట్టారు.

– ఇక భూ ఆక్రమణ చట్టం – 1905లోని పలు సెక్షన్ల కింద కలెక్టర్, తహసీల్దార్, డీటీకి ఉన్న అధికారాలు, వాల్టా చట్టం –2002, తెలంగాణ బిల్డింగ్‌ రూల్స్, తెలంగాణ ఫైర్‌ సర్వీసెస్‌ చట్టంలోని పలు అధికారాలను కూడా హైడ్రాకు వర్తింపజేశారు. అక్రమ నిర్మాణాలపై చర్య తీసుకోవడంలో జాప్యం లేకుండా కొత్త అధికారాలతో హైడ్రా మరింత స్పీడ్‌ పెంచే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular