Abhaya Hastham: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన నేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన సీఎం అయ్యారు. గత ముఖ్యమంత్రులకు భిన్నంగా వైఎస్సార్ అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించారు. పింఛన్లు పెంచారు. మహిళలకు పావలా వడ్డీకి రుణాలు అందించారు. ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, వ్యవసాయానికి ఉచిత కరెంటు తదితర పథకాలు వైఎస్సార్ ప్రారంభించినవే. ఇక మహిళలను లక్షాధికారులను చేయాలన్న సంకల్పంతో ఆయన విరివిగా రుణాలు ఇచ్చారు. అదే సమయంలో మహిళలకు వృద్ధాప్యంలో భరోసాగా ఉండాలన్న ఆలోచనతో అభయ హస్తం పథకం ప్రారంభించారు. మహిళా సంఘాల సభ్యులకు ఈ పథకం వర్తింప జేశారు. సంఘంలోని సభ్యులు రోజుకు రపపాయి చొప్పున నెలకు రూ.30 చెల్లించేలా పథకం ప్రారంభించారు. ఇలా 55 ఏళ్లు వచ్చే వరకూ చెల్లించాలి. ఇలా చెల్లించిన మహిళల వయసు 55 ఏళ్లు దాటిన తర్వాత రూ.500లకు తక్కువ కాకుండా నెలనెలా పింఛన్ ఇవ్వడం ఈ పథకం ఉద్దేశం. నాడు ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది మహిళలు ఇలా డబ్బులు చెల్లించారు. అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీనిని పట్టించుకోలేదు. దీంతో నిధుల చెల్లింపు. పింఛన్ ఇవ్వడం ఆగిపోయింది. అయితే మహిళలు చెల్లించిన డబ్బులు ప్రభుత్వ ఖజానాలో రూ.385 కోట్లుగా జమయ్యాయి.
తిరిగి ఇవ్వాలని నిర్ణయం..
గత ప్రభుత్వాలు పథకం కొనసాగించకపోగా, నిధులు కూడా తిరిగి మహిళలకు చెల్లించలేదు. దీంతో ఆ నిధులు అలాగే ఉండిపోయాయి. ఏడాది క్రితం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అభయ హస్తం నిధులు తిరిగి మహిళలకు ఇవ్వాలని నిర్ణయించింది. 2016లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అభయహస్తం పథకం రద్దు చేసింది. దీంతో ఎల్‌ఐసీ వద్ద ఉన్న ఈ డబ్బులను క్లెయిమ్ చేసి ఇతర అవసరాలకు మళ్లించినట్లు ఆరోపణు ఉన్నాయి. దీనిపై నాటి ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. 21 లక్షల మంది చెల్లించిన డబ్బులు వడ్డీతో కలిపి 2022 మార్చి నాటికి రూ.545 కోట్లు అయినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని మహిళలకు తిరిగి చెల్లించాలని గత ప్రభుత్వం ప్రకటించినా అలా చేయలేదు. సిద్దిపేటకు చెందిన మహిళలకు మాత్రమే తిరిగి ఇచ్చారు. ఈ విషయంలో ఇతర జిల్లాల మహిళలు ఆందోళన కూడా చేశారు.
రూ.385 కోట్లు రిటర్న్..
అభయహస్తం పథకంలో భాగంగా మహిళలు తమ భాగస్వామ్యంగా చెల్లించిన రూ.385 కోట్లు మహిళలకు తిరిగి ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయించినట్లు తెలిసింఇ. 2009లో అభయ హస్తం పథకంలో భాగంగా మహిళలు రోజుకు రూపాయి చెప్పున ఏడాదికి రూ.365 చెల్లించారు. ప్రభుత్వం కూడా అంతే మొత్తం మహిళల పేరిట ఎల్‌ఐసీకి చెల్లించింది. ఇలా 2022 వరకు నగదు మొత్తం రూ.545 కోట్లకు చేరింది. వడ్డీ మినహాయించి అసలు మొత్తాన్ని మహిళల ఖాతాల్లో తిరిగి జమ చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది.