Medaram Jatara: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం అవుతోంది. ఫిబ్రవరి 24 వరకు జాతర సాగుతుంది. జాతర వేళలో సుమారు 2 కోట్ల మంది భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈమేరకు భక్తుల కోసం ఇప్పటికే ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 18 నుంచి బస్సులను నడుపుతోంది. 6 వేల బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఈమేరకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
దక్షిణ మధ్య రైల్వే కూడా..
ఇక మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే కూడా ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ప్రత్యేక రైళ్లు నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్, నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపింది.
జన సాధారణ్ పేరుతో..
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వరంగల్ వరకు నడిపే ఈ రైళ్లకు జన సాధారణ్ రైళ్లుగా నామకరణం చేసింది. నాలుగు రోజులపాటు 30 రైళ్లను నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. ఈ రైళ్లలో ఎలాంటి రిజర్వేషన్ ఉండదని పేర్కొన్నారు. అన్నీ భోగీలు జనరల్ భోగీలే ఉంటాయి. ఇక ప్రత్యేక రైళ్లలో పది సికింద్రాబాద్–వరంగల్–సికింద్రాబాద్ మధ్య నడుస్తాయి. 8 రైళ్లు సిర్పూర్ కాగజ్‌నగర్ –వరంగల్– సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య, 8 రైళ్లు నిజామాబాద్ –వరంగల్– నిజామాబాద్, రెండు రైళ్లు ఆదిలాబాద్–వరంగల్– ఆదిలాబాద్, మరో రెండు రైళ్లు ఖమ్మం – వరంగల్– ఖమ్మం మధ్య నడుస్తాయని జీఎం వివరించారు.
ఖమ్మం నుంచి ప్రత్యేక రైలు
ఖమ్మం – వరంగల్ మధ్య(07021) రైలు ఉదయం 10 గంటలకు ఖమ్మం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12:30 గంటలకు వరంగల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో వరంగల్ నుంచి (07022)రైలు మధ్యాహ్నం 1:55 గంటలకు బయల్దేరుతుంది. సాయంత్రం 4:39 గంటలకు ఖమ్మం చేరుకుంటుంది. ఇక ఈ రైళ్లకు మల్లెమడుగు, పాపటపల్లి, డోర్నకల్, గుండ్రాతిమడుగు, మహబూబాబాద్, కేసముద్రం, నెక్కొండ, చింతల్‌పల్లి స్టేషన్లలో హాల్టింగ్ ఉంటంది.
నిజామాబాద్– వరంగల్ స్పెషల్ ట్రైన్
నిజామాబాద్– వరంగల్ (07019) ఎక్స్‌ప్రెస్ నిజామాబాద్‌లో ఉదయం 7:05 గంటలకు బయలుదేరి వరంగల్‌కు మధ్యాహ్నం 1:45 గంటలకు చేరుతుంది. అదే విధంగా వరంగల్–నిజామాబాద్ (07020) ఎక్స్‌ప్రెస్ వరంగల్‌లో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 10:30 గంటలకు నిజామాబాద్‌కు చేరుతుంది. ఈ రైళ్లు కాజీపేట సంక్షన్, పెండ్యాల్, ఘన్‌పూర్, రఘుఆథపల్లి, జనగామా, ఆలేరు, చర్లపల్లి, సికింద్రబాద్, మల్కాజ్‌గిరి, బొల్లారం, మేడ్చల్, మనోహరాబాద్, వదిరాం, మిర్జాపల్లి, అక్కన్నపేట, కామారెడ్డి రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుంది.
సిర్పూర్ కాగజ్‌నగర్ – వరంగల్ స్పెషల్ ట్రైన్
సిర్పూర్ కాగజ్‌నగర – వరంగల్ ప్రత్యేక రైలు(07017) సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి ఉదయం 5:30 గంటలకు బయల్దేరి వెళ్తుంది. 10 గంవటలకు వరంగల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. అదేవిధంగా వరంగల్ నుంచి కాగజ్‌నగర్‌కు(07018) రైలే సాయంత్రం 4 గంటలకు బయల్దేరి రాత్రి 12 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుకుంటుంది. ఇక ఈ రైలు కాజీపేట టౌన్, హసన్‌పర్తి, ఉప్పల్, జమ్మికుంట, బిజిగిరి షరీఫ్, కొత్తపల్లి, ఓదెల, కొలనూరు, కొత్తపల్లి, పెద్దపల్లి, రాఘవపురం, రాముగండం, పెద్దంపేట, మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపల్లి, రేచిని రోడ్, రేపల్లెవాడ, ఆసిఫాబాద్, రాళ్లపేట్‌లో హాల్టింగ్ ఉంటంది.