GO Number 252 Journalists: తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు కొత్త గుర్తింపు కార్డులు ఇవ్వక దాదాపు రెండు సంవత్సరాలు దాటిపోయింది. ఈ నేపథ్యంలో అనేక చర్చలు.. సమావేశాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం పాత్రికేయులకు గుర్తింపు కార్డులు ఇస్తామని ప్రకటించింది.. జీవో 252 కూడా విడుదల చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ, ఆ జీవోలో జర్నలిస్టులు కలవరానికి గురయ్యే అంశాలు చాలా ఉన్నాయి. అందువల్లే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాత్రికేయ లోకం నిరసన బాట పట్టింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతోంది.
జీవో నెంబర్ 252 ప్రకారం పాత్రికేయుల మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఒక విభజన రేఖ గీసింది. క్షేత్రస్థాయిలో పనిచేసే వారికి గుర్తింపు కార్డులు, డెస్క్ విభాగంలో పని చేసే వారికి మీడియా కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి ఇలాంటి పరిణామాన్ని పాత్రికేయులు ఊహించలేదు. 2016లో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నూతన గుర్తింపు కార్డు విధానాన్ని ప్రకటించింది. దానికోసం జీవో నెంబర్ 239 విడుదల చేసింది. ఆ జీవో ప్రకారం పత్రికలు, టీవీ చానల్స్ కు పలు విధాలుగా వాటాలు నిర్దేశించింది. ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారికి గుర్తింపు కార్డులు మంజూరు చేసింది. ఆ గుర్తింపు కార్డుల ద్వారానే పాత్రికేయులు హెల్త్ కార్డులు, బస్ పాస్ లను పొందారు. కొందరైతే రైల్వే పాస్ లు కూడా సంపాదించారు. ఈ గుర్తింపు కార్డులో ప్రాతిపదికగానే ఇళ్ల స్థలాలు కూడా ప్రభుత్వం ఇస్తుందని ప్రచారంలో ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూపొందించిన గుర్తింపు కార్డుల పాలసీ వల్ల డెస్క్ విభాగంలో పనిచేసే పాత్రికేయులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పాత్రికేయుల విషయంలో ఇలా విభజన రేఖ గీయాల్సిన అవసరం ఏమిటో ఏమిటో ప్రభుత్వం ఇంతవరకు చెప్పడం లేదు.. 2016 నుంచి డెస్క్ విభాగంలో పనిచేసే పాత్రికేయులు గుర్తింపు కార్డులను పొందుతున్నారు. రిపోర్టింగ్ తో పోల్చి చూస్తే డెస్క్ విభాగంలో పనిచేసే పాత్రికేయులను యాజమాన్యాలు జల్లెడ పట్టి తీసుకుంటాయి. ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు కూడా తెలుసు. అయినప్పటికీ కారణం లేకుండానే విభజన రేఖ గీస్తున్నారు. కావాలని డెస్క్ జర్నలిస్టులను ఇబ్బంది పెడుతున్నారు.
ఒక మీడియా సంస్థ పని చేయాలంటే కేవలం రిపోర్టర్ల వల్ల మాత్రమే సాధ్యం కాదు.. దానికి డెస్క్ జర్నలిస్టులు కూడా కావాలి. ఒక ముక్కలో చెప్పాలంటే మీడియా సంస్థ అనేది ఒక బండి అనుకుంటే.. దానికి రిపోర్టర్లు, డెస్క్ లో పనిచేసేవారు జోడెద్దుల లాంటివారు. కానీ ఈ విషయాన్ని ప్రభుత్వం మర్చిపోతోంది. కనీసం మీడియా అకాడమీలో పనిచేసే పెద్దలకు కూడా ఈ విషయం తెలియకపోవడం అత్యంత బాధాకరం.
క్షేత్రస్థాయిలో పనిచేసే రిపోర్టర్లు ఇచ్చే సమాచారాన్ని డెస్క్ లో పనిచేసే పాత్రికేయులు ఒకటికి రెండుసార్లు సరి చూసుకుంటారు. తప్పుడు ఏవైనా ఉంటే సరి చేస్తారు. దానిని అందంగా తీర్చిదిద్ది బాహుళ్యం లోకి పంపిస్తారు. క్షేత్రస్థాయిలో పనిచేసే పాత్రికేయులకు ఎటువంటి డెడ్లైన్లు ఉండవు. కానీ డెస్క్ లో పనిచేసే పాత్రికేయులకు కచ్చితంగా ఒక నిర్ణీత సమయం అంటూ ఉంటుంది. అందులోనే వారు పనిచేసి.. ఔట్ ఫుట్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇప్పుడు మీడియా అకాడమీలో ఉన్న పెద్దలకు తెలుసో, లేదో.. డెస్క్ విభాగంలో పనిచేసే పాత్రికేయులకు 2016లో అప్పనంగా గుర్తింపు కార్డులు రాలేదు. అనేక ఉద్యమాలు చేసి ఆ హక్కును దక్కించుకున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పని చేశారు. ఆ సమయంలో గుర్తింపు కార్డులు తమకు మంజూరు చేయాలని ఉపసంపాదకులు ఆయనను కలిశారు. అప్పుడు ఆయన అత్యంత నీచంగా మాట్లాడారు. ప్రూఫ్ రీడర్లు గా ఉండే మీకు గుర్తింపు కార్డులు ఎందుకు అన్నట్టుగా ప్రశ్నించారు.
ఈ లోగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విభజనకు గురైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాత్రికేయులు పోరాటాలు చేశారు. అందులో డెస్క్ విభాగంలో పనిచేసే పాత్రికేయులు కూడా ఉన్నారు. యాజమాన్యాల ఆంక్షలు పట్టించుకోకుండా.. అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నా సరే తెలంగాణకు జై కొట్టారు. స్వరాష్ట్రంలోనూ గుర్తింపు కోసం తీవ్రంగా పోరాటాలు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం దయ తలచి 2016 లో గుర్తింపు కార్డులను మంజూరు చేసింది.
వాస్తవానికి డెస్క్ విభాగంలో పనిచేసే వారికి అనేక రకాలైన అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. ఇక యాజమాన్యాల ఇబ్బందులు సరే సరి. వచ్చే జీతాలు కుటుంబ పోషణకు సరిపోవు. అలాంటప్పుడు ఎడిషన్ సెంటర్ల నుంచి ఇంటికి వెళ్లాలన్నా.. మరి ఏదైనా ప్రాంతానికి ప్రయాణం చేయాలన్నా అది డెస్క్ జర్నలిస్టులకు ఒక రకమైన భారం. అలాంటప్పుడు ప్రభుత్వ మంజూరు చేసిన బస్ పాస్ ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఇక హెల్త్ కార్డులు కూడా చాలామందికి ఉపకరిస్తున్నాయి. ఇదంతా తెలిసి కూడా మీడియా అకాడమీలో ఉన్న పెద్దలు ఇష్టానుసారంగా జీవోలు రిలీజ్ చేసి.. ఏదో ముఖాన మీడియా కార్డు ఇస్తామని చెప్పడం వారి అవివేకానికి నిదర్శనం.
ఇక తాజా జీవో వల్ల కేవలం డెస్క్ పాత్రికేయులు మాత్రమే కాదు.. ప్రీలాన్స్ జర్నలిస్టులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వారికి మంజూరు చేసే గుర్తింపు కార్డుల సంఖ్యను అడ్డగోలుగా తగ్గించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే పాత్రికేయులకు కూడా మంజూరు చేసే కార్డుల విషయంలో కోత విధానాన్ని పాటిస్తున్నారు. డెస్క్ విభాగంలో పనిచేసే పాత్రికేయులకు జిల్లాలోని పబ్లికేషన్స్ సెంటర్లో కేవలం నాలుగు అంటే నాలుగే ఇస్తారట. ఇదేం ప్రాతిపదిక? ఇదే విధానం..
డెస్క్ విభాగంలో పనిచేసే పాత్రికేయులు కేవలం కార్యాలయాలకు మాత్రమే పరిమితం కారు. వారికి కూడా ఫీచర్ కథనాలు, ప్రత్యేకమైన కథనాలు రాసే బాధ్యతలు ఉంటాయి. అలాంటప్పుడు వారు క్షేత్రస్థాయిలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక స్పోర్ట్స్, బిజినెస్ డెస్క్ లో పనిచేసే వారు కూడా ఫీల్డ్ లెవెల్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. అలాంటప్పుడు వారికి కూడా గుర్తింపు కార్డులు చాలా అవసరం. ఇంత తెలిసి కూడా మీడియా అకాడమీలో పెద్దలు పాత్రికేయుల మధ్య విభజన రేఖ గీయడం.. గుర్తింపు కార్డులను కుదించడం వారి అవివేకానికి నిదర్శనం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 252 ను రద్దు చేయాలి. అంతేగాని ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే కుదరదు గాక కుదరదు.