Gadala Srinivasa Rao: అప్పుడు కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నాడు.. ఇప్పుడు రేవంత్ పార్టీలోకి వెళ్తున్నాడు

భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ప్రజారోగ్య శాఖ సంచాల కుడిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు కొనసాగే వారు. కరోనా సమయంలో మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నప్పటికి. కాలక్రమేణా ఆయన గులాబీ కాంపౌండ్ కు దగ్గరయ్యారు..

Written By: Anabothula Bhaskar, Updated On : February 3, 2024 8:35 am

Gadala Srinivasa Rao

Follow us on

Gadala Srinivasa Rao: బెల్లం ఎక్కడ ఉంటే ఈగలు అక్కడ ఉంటాయి. ఇదే సామెత మనుషులకు కూడా వర్తిస్తుంది. అవకాశం ఎక్కడ ఉంటే మనుషులు కూడా అక్కడికే పరుగులు తీస్తుంటారు. మిగతా అన్ని విషయాలకంటే రాజకీయాలకు పై ఉదాహరణలు అచ్చు గుద్దినట్టు సరిపోతాయి. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. గురువారం గజ్వేల్ శాసనసభ సభ్యుడిగా కెసిఆర్ ప్రమాణ స్వీకారం చేయడం.. ఆ తర్వాత సొంత పార్టీ నాయకులతో మాట్లాడటం.. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో సభ నిర్వహించడం వంటి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వీటన్నింటి కంటే ఒక విషయం తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది.

భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ప్రజారోగ్య శాఖ సంచాల కుడిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు కొనసాగే వారు. కరోనా సమయంలో మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నప్పటికి. కాలక్రమేణా ఆయన గులాబీ కాంపౌండ్ కు దగ్గరయ్యారు.. తన పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఎలాగూ ప్రజారోగ్య శాఖ సంచాలకుడిగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ కార్పొరేట్ ఆసుపత్రులతో కొత్తగూడెం ప్రాంతంలో వైద్య శిబిరాలు నిర్వహించారు. కార్మిక ప్రాంతాలలో ప్రత్యేకంగా మొబైల్ క్లినిక్ లు ఏర్పాటు చేశారు. అంతేకాదు కేసీఆర్ ను తెలంగాణ బాపు అని కొనియాడారు. వీలు చిక్కినప్పుడల్లా కొత్తగూడెం వచ్చి రాజకీయ కార్యక్రమాలు చేపట్టేవారు. ఒకానొక దశలో భారత రాష్ట్ర సమితి కొత్తగూడెం టికెట్ తనకే అనే సంకేతాలు ఇచ్చారు. కొత్తగూడెం పట్టణానికి మెడికల్ కాలేజీ మంజూరు చేయడంతో గడల శ్రీనివాసరావు కెసిఆర్ కాళ్లు మొక్కారు. అప్పట్లో ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి దారి తీసింది. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి కొత్తగూడెం టికెట్ తిరిగి వనమా వెంకటేశ్వరరావుకి దక్కింది. దీంతో గడల శ్రీనివాసరావు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.

ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రావడం.. కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు ఓడిపోవడం తో ఒక్కసారిగా గడల శ్రీనివాసరావు భవితవ్యం పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇదే సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను ప్రజారోగ్య శాఖ సంచాలకుడి బాధ్యతల నుంచి తొలగించింది. ఆ స్థానంలో డాక్టర్ రవీంద్రనాయక్ ను నియమించింది. దీంతో గడల శ్రీనివాసరావు ఆలోచనలో పడ్డారు. ఇప్పట్లో తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి ఇప్పట్లో అధికారంలోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. పైగా రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో జరిగిన పలు అంశాలను తవ్వుతున్నారు. గడల శ్రీనివాసరావు మీద చాలావరకు అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనసు మార్చుకున్న గడల శ్రీనివాసరావు కాంగ్రెస్ వైపు తన ప్రయాణాన్ని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం త్వరలో గడల శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ లేదా ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గాంధీభవన్లో దరఖాస్తు కూడా చేసుకున్నట్టు సమాచారం. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది. మొన్నటిదాకా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ను బాపు అని కొనియాడిన గడల శ్రీనివాసరావు.. ఒక్కసారిగా కాంగ్రెస్ వైపు టర్న్ తీసుకోవడం పట్ల రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో గడల శ్రీనివాసరావుకు టికెట్ దక్కుతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.