TSRTC: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. డిసెంబర్ 7న ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణం చేశారు. మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు నుంచే రేవంత్ సర్కార్ ఆరు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. దీంతోపాటు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించారు. దీంతో నెల రోజులుగా మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు.
తొలి వారం అందరికీ..
ఉచిత ప్రయాణంలో భాగంగా మొదటి వారం రోజులు అంటే డిసెంబర్ 9 నుంచి 15వ తేదీ వరకు ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా మహిళలందరికీ అనుమతించారు. అయితే ఈ పథకం తెలంగాణ మహిళలకు ఉద్దేశించిందే అయినందున, తెలంగాణ మహిళలకు మాత్రమే ఫ్రీ బస్ సౌకర్యం కల్పించాలని కొన్ని మార్పులు చేశారు. ఈ క్రమంలో ఉచితంగా ప్రయాణించే మహిళలు తమవెంట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డులు తీసుకురావాలని నిర్ణయించింది. ఈమేరకు ఆర్టీసీ ఎండీ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. సెల్‌ఫోన్‌లో ఆధార్, లేదా ఇతర ధ్రువపత్రాల ఫొటోలు చూపితే అనుమతించమని స్పష్టం చేశారు.
పాన్‌కార్డుతో ప్రయాణం..
ఇదిలా ఉండగా, కొంతమంది ఇతర రాష్ట్రానికి చెందిన మహిళలు చాకచక్యంగా పాన్‌కార్డు చూపిస్తూ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఈవిషయాన్ని గుర్తించిన ఆర్టీసీ అధికారులు తాజాగా నిబంధనల్లో మార్పులు చేశారు. ఉచిత ప్రయాణానికి పాన్‌కార్డును అనుమతించబోమని తెలిపారు. ఈమేరకు ఆర్టీసీ ఎండీ ఆదేశాలు జారీ చేశారు. పాన్‌కార్డుపై ఫొటో ఉన్నప్పటికీ చిరునామా ఉండదు. దీంతో ఇతర రాష్ట్రాల వారూ ప్రయాణిస్తున్నారన్నారు. తెలంగాణ మహిళలు మాత్రమే లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో పాన్‌కార్డు అనుమతి రద్దు చేసినట్లు తెలిపారు. ఈమేరకు అన్ని డిపోల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డులు కచ్చితంగా వెంట తీసుకుని రావాలని తెలిపారు.