Free Bus Travel: సరిగ్గా 25 సంవత్సరాల క్రితం కమల్ హాసన్ హీరోగా భామనే సత్యభామనే అనే ఒక సినిమా వచ్చింది. అందులో కమలహాసన్ పరిస్థితుల దృష్ట్యా భామవేషం వేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల అనేక ఇబ్బందులు పడుతుంటాడు. చివరికి బస్సులో ప్రయాణించేటప్పుడు కూడా.. ప్రస్తుతం అలాంటి వేషాన్నే ఓ యువకుడు వేసుకున్నాడు. బస్సులో ప్రయాణించాడు.. చివరికి కండక్టర్ కు దొరికిపోయాడు. అంతేకాదు వార్తల్లో వ్యక్తి అయ్యాడు. సోషల్ మీడియాలో ట్రోల్ కు గురవుతున్నాడు.. దీంతో నెటిజన్లు అతడిని ఒక ఆట ఆడుకుంటున్నారు..
తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ఆడవాళ్లకు కల్పించింది. గత ఐదు రోజుల క్రితం ప్రారంభమైన ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నడుస్తోంది. సరే దీనిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కొంతమంది ఈ పథకం బాగుందని చెబుతుంటే.. కొంతమంది ఆర్టీసీ సంస్థలు నష్టాలకు గురిచేస్తోందని అంటున్నారు. ఈ వాదనతో పని లేకుండా ప్రభుత్వం ఈ పథకాన్ని విజయవంతంగా నడిపిస్తోంది.. అయితే మహిళలకు ఎలాగూ ఉచిత ప్రయాణం కావడంతో.. తాను కూడా మహిళా వేషం వేసుకొని ఉచితంగా ప్రయాణించాలని యువకుడు అనుకున్నాడు. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా మహిళా వేషం వేసుకున్నాడు. మీసాలు కనిపించకుండా మాస్క్ ధరించాడు. ఆర్టీసీ బస్సు ఎక్కాడు. కిటికీ పక్కన ఉన్న సీట్ లో కూర్చున్నాడు.
కండక్టర్ మొదట్లో పెద్దగా అనుమాన పడలేదు.. అయితే అతగాడి వాలకం చూసి ఆధార్ కార్డు ఇవ్వమని అడిగాడు. దీంతో అతడు కొంచెం తట పటాయించాడు. అనుమానం మరింత పెద్దది కావడంతో అతగాడి ముసుగు తొలగించాడు. ఇంకేముంది ఆడ వేషంలో ఉన్న మగవాడు బయటపడ్డాడు. కొందరు ఈ తతంగాన్ని వీడియో తీశారు. దాన్ని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. దీంతో అతగాడిని నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.. మరికొందరేమో టికెట్ కూడా కొనలేని స్థితిలో అతగాడు ఆడవేషం వేసుకున్నాడని జాలి చూపించడం మొదలుపెట్టారు. ఇంకొందరు భామనే సత్యభామనే సినిమాలో కమల్ హాసన్ లాగా ఉన్నాడని కితాబిచ్చారు. మొత్తానికి ఉచిత ప్రయాణం కోసం ఒక మగాడు ఆడ వేషం వేసుకోవడం నవ్వు తెప్పిస్తోంది.. ప్రభుత్వ పథకాలు ప్రజల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో కళ్ళకు కడుతోంది.
View this post on Instagram