Formula E Car Race Case: ఇన్ని రోజులపాటు ఫోన్ ట్యాపింగ్ కేసును తెరపైకి తీసుకువచ్చి.. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కెసిఆర్ వంటి వారిని విచారించింది తెలంగాణ ప్రభుత్వం. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత.. అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చిన తర్వాత.. ఈసారి ప్రభుత్వం మరింత వేగంగా అడుగులు వేయడం మొదలుపెట్టింది.
భారత రాష్ట్ర సమితిలో కార్య నిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్న కేటీఆర్ పై మరింత ఒత్తిడి తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుం బిగించారు. కేటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ జరిగింది. అందులో కుంభకోణం జరిగిందని.. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ కంపెనీకి.. తెలంగాణ ప్రభుత్వం నిధులు పంపించిందని.. ఇందులో చీకటి వ్యవహారం దాగి ఉందని ప్రస్తుత రేవంత్ సర్కార్ ఆరోపిస్తోంది.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇప్పటికే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఏసీబీ మరో రెండు రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అరవింద్ కుమార్ ను విచారించడానికి కేంద్రం అనుమతి ఇవ్వడం విశేషం.
2023లో హైదరాబాద్ నగరంలో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. దీనికి సంబంధించి ఓ విదేశీ సంస్థకు నిబంధనలు పక్కనపెట్టి నిధులు చెల్లించారు. తద్వారా 54.88 కోట్ల నష్టం ప్రభుత్వానికి వాటిల్లిందని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే నాడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాలు జారీ చేయడం వల్లే విదేశీ సంస్థకు నిధులు మంజూరు చేశామని.. నాటి పురపాలకు శాఖ స్పెషల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు.
అప్పట్లో ఏసీబీ విచారణ నిర్వహించినప్పుడు అరవింద్ కుమార్ ఇదే విషయాన్ని అంగీకరించారు . ఈ కేసులో కేటీఆర్ ను విచారించడానికి గవర్నర్ గతంలోనే అనుమతి ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన తర్వాత.. ఆ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చిన తర్వాత.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖంగా ఈ కేసు మీద దృష్టి సారించినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డికి అనేక సందర్భాలలో కేటీఆర్ సవాళ్లు విసిరారు. పొట్టోడు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసును తెరపైకి తీసుకొచ్చారని ప్రచారం జరుగుతుంది. అన్ని విధాలుగా పరిశీలించిన తర్వాత ఈ కేసును ప్రభుత్వం వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకు వచ్చిందని తెలుస్తోంది. అయితే అరవింద్ కుమార్ ను విచారించిన తర్వాత.. కేటీఆర్ ను విచారిస్తారని.. అనంతరం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని ప్రచారం జరుగుతోంది.