Naxalite Ballepu Narasaiah: నేటి కాలంలో మీడియా విస్తృతి విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా యూట్యూబ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. అందులోనూ చాలామంది సొంతంగా చానల్స్ ఏర్పాటు చేసుకున్న తర్వాత పరిస్థితి ఒకసారి గా మారిపోయింది. మీడియా అనేది చేతుల్లోకి వచ్చేసింది. యూట్యూబ్ ఛానల్ ద్వారా సంచలన విషయాలు వెలుగులోకి రావడం మొదలైంది. అలా ఓ మాజీ నక్సలైట్ చెప్పిన సంచలన నిజం చివరికి అతడి జీవితాన్ని మార్చేసింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నక్సలైట్ల ప్రాబల్యం ఒకప్పుడు విపరీతంగా ఉండేది. పెట్టుబడిదారీ వ్యవస్థకు, భూస్వామ్య వ్యవస్థకు నాటి రోజుల్లో నక్సలైట్లు వ్యతిరేకంగా పోరాడేవారు. అలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తంగపల్లి మండలం లచ్చపేట గ్రామానికి చెందిన బల్లెపు నరసయ్య పీపుల్స్ వార్ గ్రూపులోకి వెళ్ళా డు. నక్సలైట్ గా మారిపోయాడు. దళంలో ఉన్నప్పుడు జగిత్యాల ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని హతమార్చాడు.. ఆ విషయాన్ని ఇటీవల నరసయ్య ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఆ విషయాన్ని మృతుడి కుమారుడు జక్కుల సంతోష్ తెలుసుకున్నాడు. ఇదే క్రమంలో అతడు నరసయ్యతో స్నేహం పెంచుకున్నాడు.
ఇటీవల నరసయ్యకు సంతోష్ ఫోన్ చేశాడు. తనకు ఒక యూ ట్యూబ్ ఛానల్ ఉందని.. తనకు ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరాడు. ఈ క్రమంలోనే అగ్రహారం గుట్టల వద్దకు రావాలని పిలిచాడు. అక్కడికి నరసయ్య చేరుకున్న తర్వాత మాటల్లో పెట్టిన సంతోష్ పెద్ద బండతో నరసయ్యను హత్య చేశాడు. ఆ తర్వాత నేరుగా జగిత్యాల పోలీసుల మందులు లొంగిపోయాడు. వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నరసయ్య ఉద్యమంలో ఉన్నప్పుడు చాలా ఘటనల్లో పాలుపంచుకున్నాడు. సంతోష్ తండ్రిని కూడా నరసయ్య హతమార్చాడు. సంతోష్ తండ్రి సౌమ్యుడు. వ్యక్తిగతంగా ఉన్న కక్షలను దృష్టిలో పెట్టుకొని నరసయ్య అతడిని హతమార్చినట్టు సంతోష్ ఆరోపిస్తున్నాడు.. తన తండ్రిని చంపిన వ్యక్తిని హతం చేయడంతో పగ చల్లారిందని.. అందువల్లే తాను పోలీసులు ఎదుట లొంగిపోయానని సంతోష్ వెల్లడించినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఓ మాజీ నక్సలైట్ జీవితాన్ని చివరికి ఇలా మార్చింది. ఈ ఘటనతో యూట్యూబ్ చానెల్స్ కు ఇంటర్వ్యూ లు ఇచ్చే నక్సలైట్లు జాగ్రత్తగా ఉండాలని ప్రజాస్వామ్య బుద్ధి జీవులు సూచిస్తున్నారు.