Puvvada Ajay : మాజీ మంత్రికి కోపం వచ్చింది.. న్యూస్ ఛానల్ పై పదికోట్ల పరువు నష్టం దావా

ఖమ్మం జిల్లాలో ప్రజల నుంచి వస్తున్న ఆదరణ ఓర్వలేక.. కొన్ని మీడియా సంస్థలు కావాలని బురద చల్లుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తారని చెబుతున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : May 6, 2024 3:20 pm

Puvvada Ajay

Follow us on

Puvvada Ajay : ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కోపం వచ్చింది. ఎన్నికలవేళ తన పరువుకు నష్టం చేకూర్చే విధంగా డీప్ ఫేక్ ఆడియోను ఓ న్యూస్ ఛానల్ టెలికాస్ట్ చేసింది. దీంతో ఆయన ఒక్కసారిగా మండిపడ్డారు.. తన పరువుకు నష్టం కలిగించారని ఆరోపిస్తూ ఆ ఛానల్ యాజమాన్యానికి, రిపోర్టర్ కు నోటీసులు పంపించారు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఖమ్మం జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి దారుణంగా ఓడిపోయింది. కేవలం ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకుంది. అయితే అప్పట్లో పువ్వాడ అజయ్ కుమార్ వ్యవహార శైలిపట్ల విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో అప్పట్లో మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ భారత రాష్ట్ర సమితి చెందిన మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు పై దుర్భాషలాడారని.. పార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారని.. కాళ్లు చేతులు నరకాలని పువ్వాడ పిలుపునిచ్చినట్టుగా ఓ ఆడియో ఓ న్యూస్ ఛానల్ లో ప్రసారమైంది. ఈ విషయం పువ్వాడ అజయ్ కుమార్ దృష్టికి వచ్చింది. దీంతో ఆయన ఆ ఛానల్ యాజమాన్యం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రిపోర్టర్ వ్యవహార శైలిపై మండిపడ్డారు.. ఆ ఆడియో తనది కాదని.. తన పరువుకు నష్టం కలిగించే విధంగా వ్యవహరించిన ఆ ఛానల్ యాజమాన్యం పై 10 కోట్లకు దావా వేశారు. నోటీసులు కూడా పంపించారు.

ఎన్నికలవేళ ఇటీవల ఆ ఛానల్ యాజమాన్యం ఆ వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. ఇలాంటి కథనాన్ని ప్రసారం చేసే సమయంలో పువ్వాడ అజయ్ కుమార్ వివరణ తీసుకుంటే బాగుండేది. ఏకపక్షంగా కథనాన్ని ప్రసారం చేయడంతో.. అది తన పరువుకు భంగం కలిగించే విధంగా ఉందని.. ఇలాంటి పరిణామాలు సరికాదని పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై భారత రాష్ట్ర సమితి నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రజల నుంచి వస్తున్న ఆదరణ ఓర్వలేక.. కొన్ని మీడియా సంస్థలు కావాలని బురద చల్లుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తారని చెబుతున్నారు. పువ్వాడ అజయ్ కుమార్ నోటీసులు పంపిన నేపథ్యంలో.. ఛానల్ యాజమాన్యం, రిపోర్టర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.