Heat Waves: తెలంగాణ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. అగ్నిగోళంలా మండుతోంది. గతేడాదికన్నా ఈసారి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఉదయం 9 దాటాక బయటకు రావడానికి జనం జంకుతున్నారు. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదువుతున్నాయి. మరోవైపు వడగాలులు వీస్తున్నాయి. దీంతో సోమవారం(ఏప్రిల్ 29న) వడదెబ్బతో ఐదుగురు మృతిచెందారు. ఇది పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
రెండు రోజులు మరింత మంట..
ఇక రాబోయే రెండు రోజులు ఎండల తీవ్రత మరింత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎండతోపాటు వేడిగాలులు కూడా అధికంగా వీస్తాయని పేర్కొంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు రాకపోవడమే మంచిదని సూచించింది. సోమవారం అత్యధికంగా నిజామాబాద్‌లో 43.8 డిగ్రీలు, ఖమ్మంలో 43.2 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా..
ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎండలు మండుతున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్రలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో మాడు పగిలేలా ఎండలు కాస్తుండడంతో ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. పెరిగిన ఎండలకు తోడు వేడిగాలులు వీస్తున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వచ్చే మూడు రోజులు ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. 50కిపైగా మండలాల్లో తీవ్ర వడగాలులు, 70కిపైగా మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.