HomeతెలంగాణSomesh Kumar: సోమేశ్‌ చిక్కాడు.. జీఎస్టీ కేసులో అడ్డంగా బుక్కయిన మాజీ సీఎస్‌.. కేసు నమోదు.....

Somesh Kumar: సోమేశ్‌ చిక్కాడు.. జీఎస్టీ కేసులో అడ్డంగా బుక్కయిన మాజీ సీఎస్‌.. కేసు నమోదు.. అక్రమాలు ఇలా..

Somesh Kumar: తెలంగాణలో 2023 నవంబర్‌లో జరిగి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ప్రజలు ఓడించారు. కాంగ్రెస్‌కు అధికారం అప్పగించారు. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన అక్రమాలపై దృష్టిపెట్టింది. ఇందుకు ప్రధాన కారణం.. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగానే కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజీ అయిన మేడిగడ్డ పియర్స్‌ కుంగడం. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే ప్రగతి భవన్‌లోని కంప్యూటర్లను అర్ధరాత్రి తరలించడం వంటి ఘటనలు అనుమానాలకు కారణమయ్యాయి. దీంతో రేవంత్‌రెడ్డి సర్కార్‌… కేసీఆర్‌ పాలనలో సాగిన అక్రమాలు రాష్ట్రానికి జరిగిన నష్టంపై అసెంబ్లీ వేదికగా స్వేతపత్రాలు కూడా విడుదల చేశారు. ప్రధానంగా కాళేశ్వరం, విద్యుత్‌ కొనుగోళ్లలో జరిగిన ఒప్పందాలపై కమిషన్‌ను నియమించి మరీ విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఫోన్‌ ట్యాపింగ్‌ కుంభకోణం వెలుగు చూసింది. కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే ఎస్‌ఐబీ అదికారులు.. నిబంధనలకు విరుద్ధంగా విపక్ష నేతలతోపాటు స్వపక్షంలో కూడా విపక్షంగా వ్యవమరించే నేతల ఫోన్లు, సినిమా వాళ్ల ఫోన్లు, వ్యాపారులు, తదితర ఫోన్లను ట్యాపింగ్‌ చేసినట్లు నిర్ధారణ అయింది. దీంతో పలువురు పోలీస్‌ అధికారులు అరెస్ట్‌ అయ్యారు. జైల్లో ఉన్నారు. ప్రధాన నిందితుడు.. ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు మాత్రం అమెరికాలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణలో మరో కుంభకోణం వెలుగు చూసింది. ధరణిలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగిన్లు కాంగ్రెస్‌ నాయకులు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం మాజీ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అని ఆరోపించారు. తాజాగా ఆయన జీఎస్టీ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయారు.

వాణిజ్య పన్నుల శాఖలో కుంభకోణం..
తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ చెల్లింపుల్లో రూ.1000 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 75 కంపెనీలు అవకతవకలకు పాల్పడినట్లు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ వెల్లడించింది. కమర్షియల్‌ టాక్స్‌ కమిషనర్‌ రవి ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌తోపాటు పలువురిపై సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కమర్షియల్‌ టాక్స్‌ అడిషనల్‌ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లపై కేసు నమోదైంది. నిందితులపై 406, 409, 120(బీ) చట్టం కింద సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఈ నెల 26న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఏ–5గా చేర్చారు.

వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా..
సోమేశ్‌కుమార్‌ అప్పట్లో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా పనిచేశారు. ఆయన కనుసన్నల్లో హైదరాబాద్‌ ఐఐటీ రూపొందించిన సాఫ్ట్‌ వేర్‌ ఆధారంగా ప్రభుత్వానికి రావాల్సిన నిధులను పక్కదారి పట్టించి ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తించారు. దీంతో కమర్షియల్‌ ట్యాక్స్‌ అదనపు కమిషనర్‌ (సేల్స్‌ ట్యాక్స్‌) కాశీ విశ్వేశ్వరరావు (ఏ–1), డిప్యూటీ కమిషనర్‌ శివరామ్‌ ప్రసాద్‌ (ఏ–2), ప్రొఫెసర్‌ శోభన్‌బాబు (అసిస్టెంట్‌ ప్రొఫెసర్, ఐఐటీ హైదరాబాద్‌), ప్లియాంటో టెక్నాలజీస్‌ (ఏ–4)ని నిందితులుగా పేర్కొన్నారు.

రూ.450 కోట్ల కుంభకోణం నిర్ధారణ..
ఇక ఈ కుంభకోణంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శోభన్‌బాబు హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. విచారణలో భాగంగా రూ.450 కోట్ల కుంభకోణం జరిగినట్లు గుర్తించారు. రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ కూడా లబ్ధిదారులేనని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. మాజీ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ఆదేశాల మేరకే శోభన్‌బాబు సాఫ్ట్‌వేర్‌ లో మార్పులు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కమర్షియల్‌ ట్యాక్స్‌ జాయింట్‌ కమిషనర్‌ నుంచి ఫిర్యాదు అందిందని, మాజీ చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌ కుమార్‌ సహా ఐదుగురిపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని నగర పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస రెడ్డి మీడియాకు తెలిపారు. దీనిపై విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular