CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైంది. డిసెంబర్‌లో సీఎంగా ప్రమాణం చేసిన రేవంత్‌రెడ్డి తన కేబినెట్‌లోకి 11 మందిని తీసుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేల లెక్కల ప్రకారం.. 18 మందికి అవకాశం ఉంది. ఈ లెక్కన ఇంకా ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం హోం, విద్యాశాఖ వంటి కీలక శాఖలకు మంత్రులు లేరు. అవి సీఎం రేవంత్ వద్దనే ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఈ శాఖలను ఇతరులకు కేటాయిస్తారని తెలుస్తోంది. అయితే మంత్రివర్గ విస్తరణ అంశం మాత్రం తొమ్మిది నెలలుగా కొలిక్కి రావడం లేదు. ఈ క్రమంలో తెలంగాణలో రాజకీయ వాతావరణ ఒక్కసారిగా వేడెక్కింది. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. గురువారం(ఆగస్టు 22న) ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపై పడింది. ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలిపి 12 మంది ఉన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచీ అదే మంత్రివర్గం కొనసాగుతోంది. మంత్రుల సంఖ్యను ఇంకా పెంచుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ.. అది సాధ్యపడలేదు. లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనాల్సి రావడం, శాసన మండలిలో ఖాళీల భర్తీ, ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి నుంచి పెద్ద ఎత్తున వలసలు చోటు చేసుకోవడం, వారికీ మంత్రివర్గంలో చోటు కల్పించాల్సి ఉంటుందనే కారణాల మీద మంత్రివర్గ విస్తరణ ఆలస్యమైంది.
కొలిక్కి వచ్చిన విస్తరణ..
తాజాగా మంత్రివర్గ విస్తరణ అంశం ఇపుపడు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఆరుమందిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోవాలని రేవంత్‌రెడ్డి నిర్ణయించినట్లు చెబుతున్నారు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, గడ్డం వివేక్, ప్రేమసాగర్‌రావు, ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్, బాలునాయక్, రామ్మోహన్‌రెడ్డి, రామచందర్ నాయక్, మదన్‌మోహన్‌రావులకు బెర్త్ కన్‌ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు సైతం వినిపిస్తున్నప్పటికీ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్లొచ్చనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే కేబినెట్‌లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు–భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు.
నామినేటెడ్ పదవులు..
తెలంగాణ మంత్రివర్గ విస్తరణతోపాటు నామినేటెడ్ పదవుల భర్తీపైనా రేవంత్ రెడ్డి కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. వివిధ కార్పొరేషన్ల ౖచైర్మన్ల కోసం ఎంపిక చేసినవారి పేర్లను అధిష్టానానికి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఏఐసీసీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్‌మున్షీ, ఇతర నాయకులతో మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులపై చర్చించనున్నట్లు చెబుతున్నారు. వాటిపై పార్టీ అధిష్టానం ఆమోదముద్ర పడిన తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది.