Rythu Runa Mafi: మనం అవసరం కోసం ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటాం. ఈ మెత్తాన్ని ఈఎంఐ రూపంలో బ్యాంకులకు చెల్లించే పద్ధతి ప్రస్తుతం అమలులోకి వచ్చింది. ఇక వస్తువులు కొనుగోలు చేసినప్పుడు సున్నా వడ్డీతో ఈఎంఐ చెల్లించే అవకాశాలు ఉన్నాయి… తెలంగాణ ప్రభుత్వం కూడా రైతు రుణమాఫీ విషయంలో ఇదే విధానం అవలంభించాలని భావిస్తోంది. తాము అధికారంలోకి వస్తే ఏకకాలంలో రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల ముందు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈమేరకు మేనిఫెస్టోలో కూడా పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ఇచ్చిన మాట ప్రకారం పంట రుణాల మాఫీకి ప్రభుత్వం కొత్త ప్లాన్ వేస్తోంది.
బ్యాంకులకు ఈఎంఐ
ప్రస్తుతం రాష్ట్రం రూ.6 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితిలో రుణమాఫీ, అదీ ఏకకాలంలో చేయడం కత్తిమీద సామే. కానీ, కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కావడంతో దానిని నెరవేర్చాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో నిధుల సమీకరణ కష్టతరంగా మారింది. ఈ పరిస్థితిలో రేవంత్ సర్కార్ పంట రుణ మాఫీకి కొత్త ఆలోచనను తెరపైకి తెచ్చింది. ఏకకాలంలో పంట రుణాలు మాఫీ చేసి.. ఆ మొత్తాన్ని వాయిదా పద్ధతిలో బ్యాంకులకు చెల్లించాలని భావిస్తోంది. ఈమేరకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే బ్యాంకర్లతో చర్చలు కూడా జరిపింది.
ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి..
పంట రుణాల మాఫీ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాట చేయాలన్న ఆలోచనలో ఉంది. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో ప్రకటించింది. ఈ కార్పొరేషన్‌కు స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల శాఖల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని మళ్లించాలని నిర్ణయించింది. రైతులకు ఒకేసారి రుణాలు మాఫీ చేయాలని బ్యాంకులను ప్రభుత్వం కోరింది. ఈమేరకు మాఫీ అయిన మొత్తాన్ని ఈఎంఐ పద్ధతిలో నెలనెలా బ్యాంకులకు చెల్లించే ప్రతిపాదనను సిద్ధం చేసింది.
రూ.32 వేల కోట్ల రుణాలు..
ప్రస్తుతం తెలంగాణలో 30 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. రూ.2 లక్షల చొప్పన మాఫీ చేస్తే.. ప్రస్తుతం రూ.32 వేల కోట్లు అవసరం. 2014, 2018 ఎన్నికల్లో పంట రుణాల మాఫీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్.. 2014లో విజయవంతంగా రుణాలు మాఫీ చేసింది. 2018లో మాత్రం ఇబ్బంది పడింది. పూర్తిస్థాయిలో రుణాలు మాఫీ చేయలేకపోయింది. ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఇది కూడా ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమికి ఓ కారణం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఏకకాలంలో పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. మాట నిలబెట్టుకోవడానికి ఇప్పుడు కొత్త ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది. ఈఎంఐ పద్ధతిలో రుణాల చెల్లింపు ప్రతిపాదనపై బ్యాంకర్లు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.