Chevella Bus Accident: నలుగురు కూతుళ్లు పుడితే మరిచిపోయాడు.. వారికి తోడుగా కుమారుడు జన్మిస్తే సంతోషపడ్డాడు. కుమారుడు, ముగ్గురు కూతుర్లు హైదరాబాద్ నగరంలో ఉన్నత చదువులు చదువుతున్నారు. పెద్ద కుమార్తె వివాహం ఇటీవల చేసాడు.. మిగతా కుమార్తెలు ఇటీవల స్వగ్రామంలో ఒక శుభకార్యం ఉంటే వచ్చారు.. దానికి హాజరై హైదరాబాద్ వెళ్ళిపోతుండగా చేవెళ్లకు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ముగ్గురు కుమార్తెలు ప్రయాణిస్తున్న బస్సును కంకర లోడ్ తో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది దాకా చనిపోయారు. అందులో ఇతడి ముగ్గురు కూతుర్లు కూడా ఉన్నారు.
చేతికొచ్చిన ముగ్గురు కూతుళ్లు చనిపోవడంతో ఎల్లయ్య గౌడ్ బాధ మామూలుగా లేదు. అతని కుమారుడు అయితే ముగ్గురు సోదరీమణుల మృతి వార్త విని కింద పడిపోయాడు. వాస్తవానికి చేవెళ్ల ప్రాంతంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో చాలా కుటుంబాలు ఇలానే అయిన వాళ్ళని కోల్పోయాయి.. తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద రోడ్డు ప్రమాదం కావడంతో ప్రభుత్వం వెంటనే స్పందించి.. మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు పరిహారాన్ని ప్రకటించింది.. ఒక్కో కుటుంబానికి 7 లక్షల చొప్పున పరిహారాన్ని అందిస్తోంది.. ఎల్లయ్య గౌడ్ కుటుంబానికి కూడా ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించింది.. ప్రభుత్వం ప్రకటించిన విధంగా 21 లక్షల చెక్కును గురువారం అందజేశారు. చేవెళ్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్లయ్య గౌగౌడ్ ముగ్గురు కుమార్తెలు తనుషా, సాయి ప్రియ, నందిని దుర్మరణం చెందారు. ఎల్లయ్య గౌడ్ ను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరామర్శించారు.. ప్రభుత్వ అధికారులతో కలిసి గురువారం 21 లక్షల చెక్కును అందించారు.
ప్రభుత్వం అందించిన చెక్కు అందుకున్న ఎల్లయ్య గౌడ్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.. ” నా కూతుర్లను నేను బంగారం మాదిరిగా సాదుకున్నాను. వారికి ఉన్నతమైన చదువులు చెప్పిస్తున్నాను. వారు మరి కొద్ది రోజుల్లో నాకు అంది వస్తారు అనుకుంటున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.. చూస్తుండగానే నా పిల్లలు చనిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.. అలాంటి బాధ ప్రపంచంలో ఏ తండ్రికి కూడా రావద్దు.. నా రెండవ కూతురు ఉద్యోగం చేస్తూ ఉండేది. నెలకు 60,000 సంపాదించేది. నా రెండో కూతురు చనిపోయిన తర్వాత ఇప్పుడు ప్రతినెల డబ్బులు ఎవరు పంపిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఇరవై ఒక్క లక్షల చెక్కు ముగ్గురు కూతుళ్లు నాకు పంపించిన జీతమా? దేవుడు నాకు ఎందుకు ఇంత శిక్ష విధించాడు? నేను ఏం పాపం చేశాను? ఇంతటి దారుణం నాకెందుకు ఎదురైంది? ఆ ముగ్గురు కూతుర్లను గోడలకు ఫోటోలు గా నేను చూడాలా? వాళ్లను చూస్తూ నేను బతకాలా? భగవంతుడా నాకెందుకయ్యా ఇంత కష్టం ఇచ్చావు? ” అంటూ ఎల్లయ్య గౌడ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అతడు ఏడుస్తుంటే ప్రజాప్రతినిధులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు.. అతడిని ఊరుకోమని ధైర్యం చెప్పారు.