Extramarital affair: నేడు ఫ్రెండ్షిప్ డే. ఈ వేడుకను ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్నేహితులు అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అంటూ పాడుకుంటున్నారు. ఇలాంటి శుభ సందర్భంలో ఒక దారుణం చోటుచేసుకుంది. ఓ స్నేహితుడు వివాహేతర సంబంధాన్ని నడుపుతూ.. తన బెస్ట్ ఫ్రెండ్ ను హతమార్చాడు.
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు ప్రాంతంలో ఐకెపి ఆపరేటర్ తిగుళ్ల నెహ్రూ హత్యకు గురయ్యాడు. ఈ కేసును చేదించడానికి పోలీసులు కొద్దిరోజులుగా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసు విషయంలో అనేక వివరాలు తెలియడంతో.. పోలీసులకు షాక్ తగిలినంత పనైంది. చివరికి ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారి పేర్లను పోలీసులు బయట పెట్టడంతో ములుగు వాసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
నెహ్రూ చిట్స్ నడిపించేవాడు. ఈ నేపథ్యంలో నెహ్రూ వద్ద మహేష్ చిట్ వేస్తున్నాడు. దీనికిగాను ప్రతినెల 15000 చెల్లిస్తున్నాడు. మహేష్ కు కొండపాక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో పిటిగా పనిచేస్తున్న నిషారాణి అనే మహిళతో చాలా రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల నెహ్రు, మహేష్ వద్ద చిట్ ఫండ్ తబల విషయంలో విభేదాలు ఏర్పడ్డాయి. ఇద్దరు లెక్కలు చేసుకున్నారు. ఈ లెక్కల్లో మహేష్ నెహ్రూకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. విభేదాలు ఏర్పడిన నేపథ్యంలో తనకు వెంటనే డబ్బులు చెల్లించాలని నెహ్రూ డిమాండ్ చేశాడు. దీంతో మహేష్ ఆ డబ్బులు సర్దుబాటు చేయడానికి నిషా వద్దకు వెళ్లాడు. జరిగిన విషయం చెప్పాడు. ఆమె దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకొని వర్గల్ ప్రాంతంలోని ఓ మైక్రో ఫైనాన్స్ లో తాకట్టు పెట్టాడు. 58,600 తీసుకున్నాడు.. ఆ డబ్బులలో కొంత భాగాన్ని నెహ్రూకు చెల్లించాడు. మిగతా డబ్బులను అప్పులు చెల్లించాడు. తన బంగారాన్ని తాకట్టు పెట్టి ఏం చేశావని నిషారాణి మహేష్ ను నిలదీసింది. బంగారాన్ని తాకట్టుపెట్టి అప్పులు తీర్చానని మహేష్ చెప్పినప్పటికీ ఆమె నమ్మలేదు. అంతేకాదు నెహ్రూను తీసుకొచ్చి తన ముందు జరిగిన విషయం మొత్తం చెబితేనే నమ్ముతానని చెప్పింది. దీంతో మహేష్ నెహ్రూను నిషా వద్దకు తీసుకెళ్లాడు.
అప్పులకు సంబంధించి చర్చ జరుగుతుండగా నెహ్రూ నిషా మీద నోరు పారేసుకున్నాడు. అసభ్యంగా మాట్లాడాడు. దీంతో విచక్షణ కోల్పోయిన మహేష్ నెహ్రూ మీద దాడి చేశాడు. నిషా ఇంట్లో ఉన్న వైరుతో నెహ్రూ మెడకు చుట్టాడు. ఊపిరి ఆడక నెహ్రూ చనిపోయాడు. నెహ్రూ చనిపోయిన తర్వాత అతడి మృతదేహాన్ని నిషా తండ్రి కొమరయ్య సహాయంతో కారులోకి ఎక్కించారు. మద్దూరు మండలం గాగిల్లాపూర్ ప్రాంతంలోని ఒక పొలానికి తీసుకెళ్లి దాచారు. ఆ తర్వాత ఉబ్బని వినయ్ అనే వ్యక్తి ఫోన్ నుంచి నెహ్రూ భార్యకు ఫోన్ చేశారు. నెహ్రూ రేపు వస్తాడని ఆమెకు చెప్పారు.. అనంతరం అతని భార్యకు చిట్టి డబ్బులు 15000 మహేష్ ఇచ్చాడు. నెహ్రూ ఏమి కాలేదన్నట్టుగానే నాటకం ఆడాడు. ఆ తర్వాత నెహ్రూ ఫోన్ కొండపోచమ్మ కెనాల్ లో పడేశారు. పోలీసులు ట్రేస్ చేయకుండా ఉండేందుకు ఆ పని చేశారు. అయితే నెహ్రూ మృతదేహం స్థానికంగా ఉన్న కొండపోచమ్మ కెనాల్లో లభించడం.. కాళ్లు చేతులు కట్టి ఉండడంతో.. కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫోన్ నెంబర్ ఆధారంగా కాల్ డాటా పరిశీలించిన పోలీసులకు.. కీలక విషయాలు తెలిసాయి. నెహ్రూ కు మహేష్ పలుమార్లు ఫోన్ చేసినట్టు అందులో తేలింది. పైగా నెహ్రూ తన చివరి కాల్ మహేష్ తోనే మాట్లాడినట్టు కాల్ దాటాలో తేలింది. దీంతో పోలీసులు వారిదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం తెలిసింది. వివాహేతర సంబంధం కోసం మహేష్ తన ప్రాణ మిత్రుడైన నెహ్రూను చంపడం.. అది కూడా అత్యంత కిరాతకంగా మెడకు వైరు చుట్టి హత్య చేయడం.. కలకలం రేపుతోంది.