Expulsion from the party Kavitha comments : గురువారం మీడియాతో చిట్ చాట్ లో గులాబీ అధినేత కుమార్తె సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పార్టీలో బిజెపి కోవర్టులు ఉన్నారంటూ కారు పార్టీ అధినేత కుమార్తె సంచలన వ్యాఖ్యలు చేశారు. లీకు వీరులను గ్రీకు వీరులుగా అభివర్ణించిన ఆమె.. తన తండ్రికి కాలేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే స్పందించని వ్యక్తులు.. కొందరికి ఏదైనా అయితే వెంటనే రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. అంతేకాదు పార్టీకి సంబంధించిన మరికొన్ని కీలక విషయాలపై కూడా గులాబీ సుప్రీం అధినేత కుమార్తె పెను ప్రకంపనలకు గురిచేసే వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడిన మాటల తర్వాత తెలంగాణ రాజకీయాలలో వేగంగా పరిణామాలు మారిపోయాయి. అయితే వీటిపై బిజెపికి చెందిన ఓ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. గులాబీ అధినేత కుమార్తె చేసిన ఆరోపణలతో ఆయన ఏకీభవించారు. ఇక గులాబీ పార్టీకి చెందిన ఓ కీలక నాయకుడు కూడా కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై కూడా తనదైన స్పందన వ్యక్తం చేశారు. కాకపోతే ఆయన ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆమెలో ఆవేదన ఇంత స్థాయిలో గూడుకట్టుకుని ఉందా అంటూ విస్మయం వ్యక్తం చేశారు.
Also Read : కారు పార్టీపై కవిత తిరుగుబాటు వెనక కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఉందా?
ఇక గురువారం నాటి చిట్ చాట్ మీడియాలో సంచలనం సృష్టించగా.. సోషల్ మీడియాలో ప్రకంపనలకు కారణమైంది. ఇక తాజాగా శుక్రవారం కూడా గులాబీ అధినేత కుమార్తె పలు విషయాలపై మాట్లాడారు. ఆమె మంచిర్యాలలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియా చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు..” బిజెపిలో భారత రాష్ట్ర సమితి కలిస్తే లిక్కర్ నేరాన్ని అంగీకరించినట్టే అవుతుంది. గులాబీ బాస్ ను కలుద్దామనుకున్న ప్రతిసారి ఆయన వెంట చాలామంది ఉంటున్నారు. పార్టీ నుంచి నన్ను బహిష్కరిస్తారని అనుకోవడంలేదు. పార్టీలోని విషయాలను అంతర్గతంగా చర్చించాలి అని చెప్పేవారు.. నేను రాసిన లేఖను ఎలా బహిర్గతం చేశారు చెప్పాలని” గులాబీ అధినేత కుమార్తె పేర్కొన్నారు. ఇటీవల గులాబీ బాస్ ను ఉద్దేశించి రాసిన లేఖలు బహిర్గతం కావడంతో.. రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. ముఖ్యంగా కారు పార్టీలో ఊహించని సంఘటనలు చోటుచేసుకున్నాయి. ముందుగా సోదరి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తే.. ఆ తర్వాత సోదరుడు విలేకరుల సమావేశంలో పరోక్షంగా కొన్ని హెచ్చరికలు జారీ చేశాడు. ఇక ఆ తర్వాత కొద్ది రోజుల గ్యాప్ తీసుకొని సోదరి పెను ప్రకంపనలకు దారి తీసే వ్యాఖ్యలు చేశారు. అయితే వాటికి కొనసాగింపుగా అన్నట్టుగా మంచిర్యాలలో కూడా మంటలు పుట్టించే మాటలు మాట్లాడారు. అయితే ఈ వ్యవహారం ఎక్కడదాకా దారితీస్తుందో తెలియదు గాని.. ప్రస్తుతానికైతే కారు పార్టీలో మాత్రం ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి.
ఈ పరిణామాలను కొంతమంది గులాబీ పార్టీ నాయకులు తేలికగా తీసిపారేస్తున్నప్పటికీ.. వారు అనుకున్నంత ఈజీగా అక్కడ ఏమీ లేదని.. రెండు శక్తి కేంద్రాల మధ్య భీకరమైన రాజకీయ పోరాటం జరుగుతోందని తెలుస్తోంది. అంతిమంగా ఈ యుద్ధాన్ని గులాబీ అధినేత ఎలా ఆపుతారో తెలియదు కానీ.. మొత్తానికి అయితే పరిస్థితి చేయి దాటిపోయిందని అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.