Etela Rajender Shocking Comments: సోషల్ మీడియా అనేది విపరీతం అయిపోయిన తర్వాత వాస్తవం ఏదో.. అవాస్తవం ఏదో తెలియడం లేదు. కాకపోతే ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. చివరికి ఈ ప్రచారం రకరకాల చర్చలకు కారణమవుతోంది. అనేకరకాల పెడపోకడలకు దారితీస్తోంది. చివరికి జరగాల్సిన నష్టం జరుగుతోంది. ఇటువంటి సంఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. ముఖ్యంగా రాజకీయ పార్టీల నాయకులు తమకు గిట్టని నాయకుల మీద సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేస్తున్నారు. జనాల్లోకి ఊహగానాలను వ్యాప్తి చేసి అసంతృప్తికరమైన వాతావరణన్ని సృష్టిస్తున్నారు.
ఇటీవల కాలంలో ఈటెల రాజేందర్ కాస్త నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ మధ్య కాలేశ్వరం విచారణ.. హైడ్రా కూల్చివేతల మీద తీవ్రస్వరాన్ని వినిపించారు రాజేందర్. అంతకుముందు పార్టీలో ఉన్న ఒక కీలక నాయకుడి మీద తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. చరిత్రలో తొలిసారిగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిశ్శబ్దంగా ఉండే రాజేందర్ ఆ సమయంలో మండే అగ్నిగుండం లాగా దర్శనమిచ్చారు. దీంతో దెబ్బకు హై కమాండ్ రంగంలోకి రావాల్సి వచ్చింది. సాధారణంగానే బోలా మనిషి మాదిరిగా ఉంటారు ఈటెల రాజేందర్. ఎవరినీ నొప్పించకుండా తన పని తాను చేసుకుంటూ పోతారు. అవసరం అంటూ తన వద్దకు వచ్చిన వారిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయరు. పైగా వారికి కడుపునిండా భోజనం పెట్టి పంపిస్తుంటారు. అటువంటి ఈటల రాజేందర్ మీద ఇటీవల కాలంలో విష ప్రచారం మొదలైంది. ఆయన బిజెపికి రాజీనామా చేస్తున్నారంటూ కొంతమంది ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే అడ్డగోలుగా కథనాలను ప్రసారం చేశాయి. ఒకానొక సందర్భంలో రాజేందర్ పార్టీ మారుతున్నారు అనే దిశగా సంకేతాలు కూడా ఇచ్చాయి. దీంతో ఈటెల రాజేందర్ రంగంలోకి రాక తప్పలేదు.
తన సామాజిక మాధ్యమ ఖాతాలలో శుక్రవారం ఈటల రాజేందర్ ఒక కీలక పోస్ట్ చేశారు. తాను రాజీనామా చేస్తున్న విషయం గురించి స్పష్టత ఇచ్చారు. ” మీడియా, వార్తాపత్రికలు.. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ వారికి గిఫ్ట్ చేస్తున్నాను. బట్ట కాల్చి మీద వేయడం.. బురద చల్లడం మంచి పద్ధతి కాదు. నేను మాటలు మార్చను. పార్టీలు మారను. అటువంటి వ్యక్తిని కాదు. దుస్తులు ధరించిన అంత ఈజీ కాదు పార్టీ మారడం అంటే. పార్టీ మారడం అనేది జీవితంలో ఒక గొప్ప నిర్ణయం గా ఉండాలి. దానికి ఒక గొప్ప కారణం కూడా ఉండాలి. గులాబీ పార్టీ నుంచి బయటికి పంపిస్తేనే వచ్చాను. నా అంతటా నేను రాలేదు. అప్పుడు నన్ను బిజెపి దగ్గరికి తీసుకుంది. టి మారుతున్నాను అంటూ వస్తున్న వార్తలు.. చేస్తున్న ప్రచారం సరికాదు. పదేపదే నాకు శీల పరీక్ష చేయడం మంచిది కాదు. నా వ్యక్తిత్వాన్ని ఇబ్బంది పెట్టకండి. ఇకపై జరిగే ప్రచారాన్ని మీ విజ్ఞతకే వదిలిస్తున్నాను అంటూ” ఈటెల పేర్కొన్నారు. దీంతో పార్టీ మారుతున్నారు అనే ప్రచారం ఊహాగానమని.. అదంతా గాలి కొట్టుకుపోయిన పేలపిండి అని తేలిపోయింది. అయితే పార్టీలో కొంతమంది కావాలని ఈటెల రాజేందర్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని.. వారే ఈ రాజీనామా విషయాన్ని సృష్టించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.